ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అక్టోబర్ 2 నుండి బీహార్ లో చేపట్టిన జన సురాజ్ యాత్ర చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. దాదాపు 3,500 కిలోమీటర్ల మేరకు జరుప దలచిన ఈ పాదయాత్ర ద్వారా బీహార్ లో ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాత్ర పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు.
అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లో అడుగులు వేయాలని ప్రయత్నాలు ప్రారంభించడంతో పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీహార్ రాజకీయాలు ఆకట్టుకొంటున్నాయి. గతంలో ప్రశాంత్ కిశోర్ జేడీయూలో చేరి ఉపాధ్యక్ష పదవి చేపట్టారు.
అంతేకాదు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో జతకట్టి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించేందుకు సహకరించారు. ఆర్జేడీ ని వదిలి, తిరిగి బిజెపితో చేరినందుకే అసమ్మతి వ్యక్తం చేస్తూ నితీష్ కుమార్ కు దూరమయ్యారు. అయితే ఇప్పుడు తిరిగి ఆర్జెడీకి నితీష్ దగ్గరైనా తరచూ ఆయన ప్రభుత్వంపై ఘాటైన వాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
ఈ యాత్ర ప్రారంభించే ముందు, గత నెలలో పాట్నాలో నితీష్ కుమార్ ను ప్రశాంత్ కిషోర్ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది. పది, పదిహేను రోజుల క్రితం తనను పిల్వడంతోనే వెళ్లి కలిశానని, ఈ సందర్భంగా తనను జేసియు కోసం పనిచేయమని కోరారని అంటూ ఇప్పుడు ప్రకటించారు.
అయితే తాను జన సురాజ్ యాత్ర చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నానని, అందువల్ల మళ్ళీ జేడీయూ కోసం పని చేయడం సాధ్యం కాదని చెప్పానని తెలిపారు. అయితే ఈ వాఖ్యాలను జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ కొట్టిపారవేసారు. నితీశ్‌తో సమావేశమైనట్లు వచ్చిన వార్తలను ప్రశాంత్ మొదట్లో తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు.
ఈ సమావేశం గురించి నితీశ్ ధ్రువీకరించిన తర్వాత ఆయన అంగీకరించారని తెలిపారు. జన సురాజ్ యాత్ర చేయాలన్న పట్టుదల ఉంటే నితీశ్‌ను కలిసేందుకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య జరిగిన సమావేశం మర్యాదపూర్వక సమావేశం కాదని స్పష్టం చేశారు.
యాత్ర కోసం చేస్తున్న ఖర్చులు, వార్తా పత్రికల్లో ఇస్తున్న ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చుల గురించి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దాంతాల పరంగా కాకుండా ఆచరణలో గాంధేయవాదిగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఇంత పెద్ద యాత్రకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రశాంత్ కిశోర్ తన పాదయాత్రకు ఏ పేరైనా పెట్టుకోవచ్చని, కాని ఆయన మాత్రం బిజెపి తరఫున పనిచేస్తున్నట్లు తమకు కనపడుతోందని జెడియు అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ విమర్శించారు.