మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఆత్మగౌరవం కోసమే జరుగుతోందని పేర్కొంటూ టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడేలా మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెబుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, కనీసం ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు.
యువత బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణను కుటుంబ పాలన నుంచి రక్షించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగునా అడ్డుకున్నారని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడినా మైకులు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు ప్రజల ఆవేదనను సర్కారు ఏనాడూ పట్టించుకోలేదని అంటూ సీఎం కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు అక్రమంగా వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్నా మునుగోడును అభివృద్ధి చేయలేకపోతున్నానన్న ఆవేదనతోనే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
మునుగోడులో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని బీజేపీ ఆఫీసులో మున్సిపల్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, ప్రతి ఓటరుకూ అవగాహన కల్పించాలని చెప్పారు.
మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలన్నీ చెప్తున్నాయని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి భారీ మెజార్టీ కోసం పని చేయాలని కోరారు. చౌటుప్పల్ లో రెండు వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలని వివేక్ వెంకటస్వామి సూచించారు.
చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన సీపీఎం నేతలు కృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు నాయకులు మంగళవారం బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి బీజేపీ కండువా కప్పి వారిని పార్టీలోకి
ఆహ్వానించారు.