దసరా పండుగ వేళ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనంతరం పార్టీ పేరులో మార్పు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి సమర్పించనున్న దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేశారు.
మరోవైపు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని గుర్తించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ జనరల్ సెక్రెటరీ లేఖ రాశారు. పార్టీ పేరు మారుస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేసిన వెంటనే తెలంగాణ భవన్ ఎదుట పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తూ సంబురాలు చేశారు కార్యకర్తలు.
సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించారు.
సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను కూడా బీఆర్ఎస్ కలుపుకు పోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ పార్టీ ఆవిర్భవించడంపై జనతాదళ్ (ఎస్) నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హర్షం ప్రకటించారు. ‘‘ కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు.. బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. అయితే ఎమ్మెల్సీ కవిత ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.
బీఆర్ఎస్తొ లి ఫోకస్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘నేను దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీని మీ రాష్ట్రానికి పరిమితం చేస్తే ఎలా ? అని చాలామంది అడిగారు. అందుకే దేశ ప్రజల కోసం బీఆర్ఎస్ ను ప్రకటించాం’’ అని కేసీఆర్ తెలిపారు.
‘‘దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయింది. నాకు రాజకీయం ఒక టాస్క్’’ అని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకుపోతామని వెల్లడించారు.