రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఇప్పటికే ముర్మును రాష్ట్రపత్ని అని వ్యాఖ్యానించిన అధిర్ రంజన్ చౌదరి అనంతరం ఆమెకు క్షమాపణలు చెప్పారు.
కాగా, మరో కాంగ్రెస్ నేత కూడా అధిర్ రంజన్ మార్గంలోనే నడుస్తూ రాష్ట్రపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన స్పందన కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది.
రెండు రోజుల క్రితం గుజరాత్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించిన సందర్భంగా దేశవ్యాప్తంగా వాడుతున్న ఉప్పులో 76 శాతం గుజరాత్‌లోనే తయారవుతున్నదని చెప్పారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్‌ను ముర్ము కీర్తించారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్రపతిని `చెంచా’ అంటూ తిట్ల వర్షం కురిపించాడు. ఆమె తీరు మరీ సిల్లీగా ఉన్నదని వ్యాఖ్యానించాడు.
ఉదిత్ రాజ్ తీరుపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని, ఈ విషయంలో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలుపాలంటూ నోటీసు జారీ చేసింది. “దేశం యొక్క అత్యున్నత అధికార శక్తికి వ్యతిరేకంగా, తన కష్టపడి ఈ స్థానానికి చేరుకున్న మహిళకు వ్యతిరేకంగా అత్యంత అభ్యంతరకరమైన ప్రకటన. @Dr_Uditraj తన అవమానకరమైన ప్రకటనకు క్షమాపణలు చెప్పాలి. @NCWIndia అతనికి నోటీసు పంపుతోంది’ అని మహిళా కమీషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ట్వీట్ చేశారు.
రాష్ట్రపతిపై ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విచారం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కుంభమేళాకు బీజేపీ ప్రభుత్వం రూ.4200 కోట్లు ఎలా ఖర్చు చేసిందంటూ ప్రశ్నించారు. పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయి రోడ్డుపై నిలిచిన సందర్భంలో.. సెక్యూరిటీ జిమ్మిక్కు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.