ముంబైలోని వేర్‌హౌజ్ నుంచి సుమారు రూ. 120 కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్ డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో మాజీ ఎయిర్ ఇండియా పైలెట్ సోహెల్ గఫార్‌ను అరెస్టు చేశారు.
ఇటీవల గుజరాత్‌లోని జామ్నగర్లోనూ భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న కేసుతో దీనికి లింకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జామ్‌నగర్ కేసులో ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. అమెరికాలో శిక్షణ పొందిన గఫార్ గతంలో ఎయిర్ ఇండియాలో పైలెట్‌గా పనిచేశారు.
అయితే మెడికల్ కారణాలను చూపుతూ అతను కొన్నాళ్ల క్రితం జాబ్ మానేశారు. విదేశీ డ్రగ్ కార్టెల్ ఇప్పటి వరకు 225 కేజీల మెఫిడ్రోన్ డ్రగ్‌ను మార్కెట్లో అమ్మింది. దాంట్లో 60 కేజీల డ్రగ్‌ను గురువారం సీజ్ చేశారు. జామ్‌నగర్‌కు చెందిన నేవీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ముంబైలో నార్కోటిక్స్ శాఖ దాడులు చేసింది.
గత కొన్నాళ్ల నుంచి గుజరాత్లో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. వడోదరలో ఆగస్టులో 200కేజీల మెఫిడ్రోన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఏప్రిల్‌లో 260 కిలోల డ్రగ్స్‌ను కండ్లా పోర్టులో పట్టుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టులో సుమారు 21 వేల కోట్ల విలువైన 3వేల కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
మరోవంక, ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తు మత్తు మందు హెరాయిన్ పట్టుబడింది. పకడ్బందీ సమాచారం మేరకు మలావీ నుంచి వస్తున్న ప్రయాణికులపై కన్నేసి రూ. 100 కోట్ల కన్నా ఎక్కువ విలువ గల మత్తు మందును పట్టుకున్నట్లు తెలుస్తున్నది.
ఆఫ్రికన్ దేశమైన మలావీ నుంచి ఖతార్ మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన కచ్చితమైన సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాపు కాశారు.
అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. మలావీ ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయగా ట్రాలీ బ్యాగు కావిటీస్ తయారుచేసి దాచిన 16 కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేసిన ఘనా మహిళను కూడా అరెస్టు చేశారు.