బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీ యజమాని, మాజీ ఎమ్యెల్యే, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ 9 గంటల పాటు ప్రశ్నించింది. కొనుగోలు అంశంపై తనను ప్రశ్నించారని, తాను మనీలాండరింగ్‌కు పాల్పడలేదని చెప్పారు. తమ కంపెనీ తరపున ఎలాంటి అవకతవకలూ జరగలేదని పేర్కొన్నారు.
ఈడీ అధికారుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని, తనను మరోసారి విచారణకు రమ్మన్నారని చెప్పారు. ఈడీ ఎప్పుడు పిలిచినా వెళ్తానని తెలిపారు. ఈడీ అధికారులు గౌరవంగా చూసుకున్నారని జేసీ చెప్పారు. ఈడీ అంటేనే అందరూ భయపడతారని, తనలాంటి వారికి నిజాయితీని నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటని జేసీ చెప్పారు.
వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అశోక్ లైలాండ్ వాహనాల వ్యవహారం అయినప్పుడు వారినే అడగాలని పేర్కొన్నారు. ఇది కోట్ల రూపాయల స్కామ్ ఏమి కాదని అంటూ ఈ కేసుతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఈడీ ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని చెప్పారు.
126 బస్సులను స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ వద్ద జేసీ కంపెనీ కోనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నాగలాండ్‌లో కొనుగోలు చేసి ఏపీలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా నగదు బదిలీ అయిందని, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. బిఎస్-3 వాహనాలను బిఎస్-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జేసీ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది.