కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని సిబిఐని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సజీవ సాక్ష్యమని తీవ్ర విమర్శలు చేశారు. డీఐజీ లెవల్ అధికారితో కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని సీబీఐని కోరినట్లు షర్మిల చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్లు ఉండగా, కేసీఆర్ సీఎం అయ్యాక ఆ వ్యయం రూ. 1.20 లక్షల కోట్లకు చేరుకుందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
చిన్న పని మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకం వరకు ప్రతి కాంట్రాక్ట్ ను మేఘా సంస్థకే అప్పజెప్పుతున్నారని పేరొక్నటు కేసీఆర్ కు మేఘా సంస్థకు మధ్య అవినీతి ఒప్పందం ఉందని షర్మిల ఆరోపించారు. మేఘా సంస్థకు టెండర్లు అప్పగించే క్రమంలో నియమ, నిబంధనలను తుంగలో తొక్కారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కేసీఆర్ ముందుచూపు లోపం, అసమర్థత వల్ల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికి పనికి రాకుండా పోయిందని ఆమె తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైగే అవుతోందని షర్మిల చెప్పారు. ఒకప్పుడు స్కూటర్ కూడా లేని కేసీఆర్ కు ఇవాళ సొంతంగా విమానం కొనుక్కునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర షెకావవత్ లు రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె నిలదీశారు.
కాగా, బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ మరో డ్రామాకు తెర తీశారని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తో దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని ఆమె చెప్పారు. కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని అంటూ తక్షణమే ఆయన రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.