పంజాబ్‌లోని అమృత్సర్ స్వర్ణదేవాలయంలోకి శనివారం ఓ ఆగంతకుడు చొరబడి, సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగుతున్నది. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు అతడిపై దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడికి గల కారణాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది.
అయితే ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ ప్రకటించారు. అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ (శాంతి భద్రతలు) ఈ సిట్‌కు సారథ్యం వహిస్తారు. రెండు రోజుల్లోగా సిట్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సిట్ ఆమూలాగ్రం దర్యాప్తు చేస్తుందని చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ప్రార్థనల సమయంలో ఆలయం లోపలికి ఓ వ్యక్తి వెళ్లాడు. బంగారు గ్రిల్స్ దాటి, ఖడ్గాన్ని పట్టుకుని, పూజారి గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న ప్రాంతానికి చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా, అప్పటికే ఆగ్రహంతో ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని, 30 ఏండ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించడాన్ని శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భాయి గురుప్రీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు. స్వర్ణ దేవాలయం పవిత్రతపై దాడి జరగడం చాలా బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందులో కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమైన చర్య అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఖండించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరిన బిజెపి పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి అలాంటి సందర్భాలను ఉపయోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సర్దార్ ఆర్పీ సింగ్ దర్బార్ సాహిబ్‌లో శ్రీ గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు.
సిబిఐ దర్యాప్తులో ఆ వ్యక్తి ఎవరు, అతని ఉద్దేశం ఏమిటి, అతని వెనుక ఉన్న వ్యక్తులు వంటి వాస్తవాలు వెల్లడవుతాయని సింగ్ సూచించారు. కేసును సీబీఐకి అప్పగించేలా చన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ ఉదంతాన్ని ఉపయోగించరాదని, దర్బార్ సాహిబ్‌లోని ‘బీడీబీ’ (త్యాగం) కేసును తక్షణమే సీబీఐకి అప్పగించేలా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఒప్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ ఘటన మరువక ముందే పంజాబ్‌లో మరో ఘటన జరిగింది. కపూర్తలో జిల్లాలోని నిజాంపూర్ గురుద్వారలో సిక్కు మతపరమైన జెండాను తొలగించడానికి ఓ ఆగంతకుడు ప్రయత్నించాడు. దీంతో భక్తులు ఆయన్ను చితకబాదారు. దీంతో ఆ ఆంగతకుడు మృతి చెందాడు.
ఈ ఘటన ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగిందని, తమ జెండాను తొలగించడానికి ఆ ఆగంతకుడు ప్రయత్నించాడని భక్తులు పేర్కొంటున్నారు. పోలీసులతో పాటు మరెవ్వరు కూడా ఇందులో జోక్యం చేసుకోరాదని, పోలీసులు, ప్రభుత్వం సమానంగా బాధ్యత వహించాలని గురుద్వారా డిమాండ్ చేసింది.