తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతున్న దేశ రాజధానిలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాల్లో డొంక కదులుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న ఈ కేసులో ఇప్పటికే విజయ్ నాయర్, సమీర్ మహేంద్రును అరెస్టవగా, తాజాగా తెలుగు వ్యక్తి అభిషేక్ బోయినపల్లి అరెస్టయ్యారు.
అభిషేక్‌ను అరెస్టు చేసినట్టు సోమవారం ఉదయం ప్రకటించిన సీబీఐ, మధ్యాహ్నం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరు పరిచింది. మరింత విచారణ జరిపేందుకు 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరగా, న్యాయస్థానం 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది.
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం ఇండోస్పిరిట్ సంస్థ ఖాతా నుంచి అభిషేక్ బోయిన్పల్లి ఖాతాకు రూ. 3.85 కోట్లు చేరగా, ఏ లావాదేవీ కోసం ఈ నగదు అందుకున్నారనేది అభిషేక్ చెప్పలేకపోయారని తెలిసింది. రెండు, మూడు ఖాతాల ద్వారా అభిషేక్ ఖాతాలోకి నిధులు వచ్చాయని తెలిపింది. ఈ నగదును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారని, ఆ కంపెనీల్లో అభిషేక్‌కు షేర్లు ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం సమయంలో అభిషేక్ వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యారని వెల్లడించింది. కోర్టు అనుమతి మేరకు 3 రోజుల పాటు అభిషేక్‌ను కస్టడీలో ప్రశ్నించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసుకుంది. అభిషేక్ కేవలం తెర ముందు కనిపిస్తున్న పాత్ర మాత్రమేనని, తెరవెనుక సూత్రధారులు, పెద్ద మనుషులు ఉన్నారని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అభిషేక్ వాంగ్మూలాన్ని నమోదు చేసే క్రమంలో వారందరి వివరాలను రాబట్టాలని చూస్తోంది.