పార్లమెంట్‌ను రద్దు చేయనున్నట్లు మలేషియా ప్రధాని ఇస్మాయిల్ సబ్రి యాకుబ్ సోమవారం ప్రకటించారు. పార్లమెంట్ గడువు ముగియడానికి ఇంకా తొమ్మిది నెలలు ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ పార్లమెంట్ రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే నవంబర్లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్మాయిల్ నేతృత్వంలోని యునైటెడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్(యుఎంఎన్ఓ) ఇతర పార్టీలతో కలసి ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే తన భాగస్వామ్య పక్షాలతో పొసగని కారణంగా ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో తన సత్తా చాటి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యుఎంఎన్ఓ ఆలోచిస్తోంది.
ఆదివారం మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్లాన్ అహ్మద్ షాను కలుసుకున్న ఇస్మాయిల్ పార్లమెంట్ రద్దుకు ఆమోదాన్ని కోరారు. 2018 ఎన్నికల తర్వాత ఏర్పడిన మూడవ ప్రభుత్వం చట్టబద్ధతపై విమర్శలు వస్తున్న దృష్టా తాజాగా ఎన్నికలకు వెళ్లేందుకు అనుమతించాలని ప్రధాని ఇస్మాయిల్ సుల్తాన్‌ను కోరినట్లు తెలుస్తోంది.
దేశంలో సుస్థిర, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజాతీర్పును కోరతామని టివిలో ఇస్లాయిల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇక తీర్పు ఇవ్వడమనేది ప్రజల వంతేనని తెలిపారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజా తీర్పు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని ఆయన చెప్పారు. ఎన్నికల తేదీని ప్రకటించేందుకు వారం రోజుల్లోగా ఎన్నికల కమిషన్ సమావేశమవుతుంది.