రెండుగా చీలిపోయిన శివసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త పేర్లను కేటాయించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పేరును కేటాయించింది. ఠాక్రే నేతృత్వంలోని సేనకు ఎన్నికల సంఘం పార్టీ చిహ్నంగా కాగడ (మషాల్) ను కేటాయించింది.
అయితే షిండే వర్గానికి మాత్రం పార్టీ గుర్తును ఇంకా కేటాయించలేదు. దానికి బదులుగా మంగళవారం ఉదయం 10 గంటలలోపు మూడు తాజా ఆప్షన్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం షిండే వర్గాన్ని కోరింది. అంతకుముందు, రెండు వర్గాలు ప్రతిపాదించిన గదా, త్రిశూలం మతపరమైన చిహ్నాలు కావడంతో ఎన్నికల సంఘం వాటిని తిరస్కరించింది. రాజకీయ పార్టీలకు మతపరమైన చిహ్నాలను కేటాయించడాన్ని ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకించింది.
ముంబైలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గంలో నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నిక కోసం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవలసిందిగా భారత ఎన్నికల సంఘం ఠాక్రే, షిండే వర్గాలను కోరింది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాత్కే ఆకస్మిక మృతితో తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చింది. ఉఎన్నిక కోసం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం నుంచి రమేష్ లాత్కే భార్య రుతుజ పోటీ చేస్తున్నారు.
ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్ పేరును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తు అంశాన్ని తొలుత శివసేన చీలిక వర్గం సారథి ఏక్ నాథ్ షిండే అక్టోబరు 4న కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. శివసేన పార్టీ గుర్తు తమదేనని, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేని ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాన్ని తూర్పు అంధేరి ఉప ఎన్నికలో వినియోగించకుండా చూడాలని కోరారు.
స్పందించిన ఈసీ శివసేనలోని రెండు వర్గాలు దీనిపై అక్టోబరు 7కల్లా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ వివరణలను పరిశీలించిన ఈసీ ప్రస్తుతానికి తూర్పు అంధేరి ఉపఎన్నిక కోసం శివసేన గుర్తు ‘విల్లు బాణం’ ను శివసేనలోని ఏ వర్గం కూడా వినియోగించరాదని ఆదేశించింది. కొత్త గుర్తును, కొత్త పేరును ఎంపిక చేసుకొని పోటీ చేయాలని నిర్దేశించింది.