చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాలకు మార్పులు చేర్పులు చేయాలని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక సూచించింది. ప్రస్తుతమున్న పాఠ్యాంశాల్లో పలువురు చారిత్రక వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధులను దోషులుగా చిత్రీకరించారనీ, వాటిస్థానంలో రాజవంశాల ఘనకీర్తిని, 1947 తర్వాత చరిత్ర, ప్రపంచ చరిత్ర అంశాలు చేర్చాలని కమిటీ సూచించింది.
బిజెపి ఎంపి వినయ్ పి సహస్రబుద్ధే నేతృత్వంలోని ఈ కమిటీ పాఠ్యాంశాలతో పాటు పలు ప్రతిపాదనలను సూచించింది. పుస్తకాల సంఖ్యను, పాఠ్యాంశాలను తగ్గించి పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగు బరువు తగ్గించాలని పేర్కొన్నది.
పాఠ్యపుస్తకాలను నాణ్యమైన ప్రమాణాలలో అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది. పాఠ్యాంశాల రూపకల్పనలో బహుళ విభాగాలకు చెందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని, విద్యార్థుల స్వీయ అధ్యయనానికి వీలుగా పుస్తకాలతో పాటు చిత్రాలు, గ్రాఫిక్స్, ఆడియో-విజువల్ సామాగ్రిని ఉపయోగించాలని కమిటీ తెలిపింది.
పాఠ్యాంశాలలో వివిధ వృత్తులలో మహిళలకు సంబంధించిన విషయాలను, స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర గురించిన వివరాలు సముచితంగా పొందుపర్చాలని పేర్కొంది.
డ్రగ్స్, ఇంటర్నెట్ వ్యసనాలతో పాటు సమాజానికి చేటు కల్గిస్తున్న ఇతర అంశాల గురించి విద్యార్థులకు అవగాహన పెంచే పాఠ్యాంశాలను చేర్చాలని కమిటీ పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఏకాత్మిక్’ పుస్తకం తరహాలో అన్ని సబ్జెక్టులను ఒకే పుస్తకంలో చేర్చి ప్రాథమిక తరగతుల పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించాలని పేర్కొంది.
జాతీయ విద్య, శిక్షణ పరిశోధన మండలి (ఎన్‌సిఇఆర్‌టి), రాష్ట్రస్థాయి విద్య, శిక్షణ పరిశోధన మండలి (ఎస్సిఈఆర్టి) రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ ప్రచురించాలని సూచించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సిఐసిఎస్ఇ), స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డుల ద్వారా అమలు చేయడానికి వివిధ సబ్జెక్టుల కోసం కోర్ క్లాస్ వారీగా ఉమ్మడి సిలబస్‌ను అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పేర్కొంది.