రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రెండున్నర నెలల (78 రోజుల) దీపావళి బోనస్ ను ప్రకటించింది. 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మొత్తం రూ.1823 కోట్లను పండుగ బోనస్ గా చెల్లిస్తామని వెల్లడించింది.
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, ప్రభుత్వ రంగంలోని మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ల నష్టాల భర్తీకి రూ.22 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్యకాలంలో ఎల్పీజీ గ్యాస్ ను మార్కెట్ ధర కంటే తక్కువకు ఆయిల్ కంపెనీలు విక్రయించిన సందర్భాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ గ్రాంట్ ను వినియోగిస్తామని స్పష్టంచేశారు. ఈ వ్యవధిలో ఎల్పీజీ ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు 300 శాతం పెరిగాయని అనురాగ్ ఠాకూర్ గుర్తుచేశారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.600 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ‘మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల బిల్లు 2022’కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. ‘మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల బిల్లు 2002’కు సవరణలు చేయడం ద్వారా కొత్త బిల్లును రూపొందించామని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
దీనివల్ల దేశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ కు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల్లో పారదర్శకతను పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు.