ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సిటిసి) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటకంను విస్తరించేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విజయవాడ నుంచి కాశ్మీర్‌కు పర్యాటక ప్యాకేజీ కింద ప్రత్యేకంగా డొమెస్టిక్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు సాధ్యాసాధ్యాలను ఐఆర్సిటిసి పరిశీలిస్తోంది.
ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా కాశ్మీర్ టూరిజాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, విశాఖ నుంచే ఈ తరహా ప్యాకేజిలు నడుస్తున్నాయి, వీటితో పాటు ఉత్తర భారతదేశ దర్శనీయ యాత్ర, గోవా, హంపి ప్రత్యేక ప్యాకేజి కింద ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
పిబ్రవరి 12న గోవా, హంపి యాత్రా రైలు బయలుదేరి 18న తిరిగి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రూట్‌మ్యాప్ ఖరారు చేశారు. అనకాపల్లి, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ రైలులో ప్రయాణీకులు ఎక్కవచ్చు దీనికి స్లీపర్ క్లాస్ రూ.6,620, ఎసి 3టైర్లో రూ.8,090లుగా ధర నిర్ణయించారు.
ఉత్తర భారతదేశ యాత్ర, వైష్ణోదేవి సందర్శన టూర్ మార్చి 19న ప్రారంభమై 27న తిరిగి గమ్యస్ధానాలకు చేరుకుంటారు. దర్శనీయప్రాంతాలుగా ఆగ్రా, అమృత్సర్, హరిద్వార్, మాథుర, వైష్ణోదేవి ఆలయం ప్రాంతాలను సందర్శించే విధంగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
ప్రయాణీకులు రాజ మండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో ఎక్కవచ్చని ఐఆర్సిటిసి వర్గాలు తెలిపాయి. టిక్కెట్ ధర స్లీపర్ క్లాస్ రూ.8,510లు, ఎ సి 3టైర్లో రూ.10,400లుగా టిక్కెట్ ధరగా నిర్ణయించారు.
కాగా, తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు వీలుగా ఐఆర్సిటిసి ఐదు ప్రాంతాలనుంచి టూర్‌ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఇందులో హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, కరీంనగర్ల నుంచి ఈ ప్యాకేజీ రైళ్లు అందుబాటులో ఉన్నట్లు సికింద్రాబాద్ ఐఆర్సిటిసి డిప్యూటీ జనరల్ మేనేజరు డిఎస్జిపి కిశోర్ తెలిపారు.
ప్యాకేజీ ట్రైన్ల వివరాలు , టిక్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. వీటితో పాటు ఈ ప్యాకేజీలో బుక్ చేసుకున్న వారికి ఐఆర్సిటిసి నిర్వాహకులకు విఐపి కోటాలో (రు.300లు) టిక్కెట్ ధర చెల్లించి దర్శనం చేయించడం జరగుతుందని పేర్కొన్నారు.