రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలలో పోటీ పడుతున్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ ఎన్నికలు జరుగుతున్న తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనపై పోటీ చేస్తున్న మరో మాజీ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే `గాంధీ కుటుంభం’ నిలబెట్టిన అభ్యర్థిగా అనధికారికంగా పార్టీ వర్గాల నుండి మద్దతు లభిస్తుండటం, తన పట్ల నిరాదరణ వ్యక్తం చేస్తుండడం పట్ల బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పిసిసి అధ్యక్షులు, పార్టీ సీనియర్లు అందరు ఖర్గేకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ తాను పర్యటనలకు వెడుతుంటే మొఖం చాటేస్తున్నారని వాపోయారు. పైగా, ఓటర్ల జాబితా సహితం అస్తవ్యస్తంగా ఉన్నదని విమర్శలు గుప్పించారు. `పీసీసీ డెలిగేట్ల జాబితాలు పొంతన లేకుండా ఉన్నాయని, అందువల్ల పీసీసీ డెలిగేట్లను సంప్రదించడానికి తన బృందం చాలా ఇబ్బందులుపడిందని తెలిపారు. గాంధీ కుటుంబం’ కారణంగా తనకు పార్టీలో ప్రముఖులు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా ఎవరూ ప్రచారం చేయకూడదని శశిథరూర్ స్పష్టం చేశారు. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మల్లిఖార్జున ఖర్గేకు మద్దతుగా ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలోని గెహ్లాట్ వ్యాఖ్యలను శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీదారులకు సమాన అవకాశాలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
భోపాల్‌ని పార్టీ కారాల్యయంలో మాట్లాడతూ.. ‘పార్టీ ఆఫీస్ బేరర్, ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లు అయినా అధ్యక్ష అభ్యర్థికి మద్దతుగా ఎవరూ ప్రచారం చేయకూడదనే స్పష్టమైన ఆదేశాలున్నాయని’ పేర్కొన్నారు. గెహ్లాట్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు. అలాగే మల్లిఖార్జున ఖర్గేకు మద్దతుగా ప్రచారం చేయడంపై కేంద్ర ఎన్నికల అథారిటి (సిఇఎ) నిష్పక్షపాతంగా గెహ్లాట్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఖర్గేకు స్వాగతం పలకడానికి పీసీసీ చైర్పర్సన్లు, సీనియర్ నేతలు వస్తున్నారని, తనను మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. అయితే, దీనిపై తాను ఫిర్యాదు చేయడం లేదని తెలిపారు. సాధారణ కాంగ్రెస్ కార్యకర్త ఓటుకు, సీనియర్ నేత ఓటుకు సమాన విలువ ఉంటుందని తనకు తెలుసునని చెప్పారు.
బిజెపి ఎద్దేవా
థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్లో, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో సమాన అవకాశాలు లేవని థరూర్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఓ ప్రహసనమని ఆయనకు తెలుస్తోందని చెప్పారు. పీసీసీ డెలిగేట్ల వివరాలతో కూడిన జాబితాను సైతం ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే పట్ల ఉత్సాహంతో ఉన్నారని, శశి థరూర్ వైపు తొంగి చూడటం లేదని వ్యాఖ్యానించారు. గాంధీలకు త్వరలోనే మరో మన్మోహన్ సింగ్ రాబోతున్నారని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థులుగా శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గే మధ్యే పోటీ నడుస్తుంది. ఈ ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆ పార్టీ శ్రేణుల్లోనే విభిన్న స్వరాలు వినిపించడం గమనార్హం.