న్యాయం పొందడం ఆలస్యం కావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన దేశానికి, సామరస్యపూర్వకమైన సమాజానికి సున్నితమైన న్యాయవ్యవస్థ అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
చట్టంలో అస్పష్టత సంక్లిష్టతను సృష్టిస్తుందని, అందువల్ల పేద ప్రజలు సైతం సులభంగా అర్థం చేసుకునే విధంగా ‘ఈజ్ ఆఫ్ జస్టిస్’ను తీసుకురావడం కోసం తేలిగ్గా అర్థమయ్యే విధంగా ప్రాంతీయ భాషల్లో కొత్త చట్టాలను రాయాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. న్యాయపరమైన భాష పౌరులకు ఒక అడ్డంకిగా మారకూడదని కూడా ఆయన తెలిపారు.
గుజరాత్‌లోని కేవాడియా జిల్లాలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’కి దగ్గర్లో ఉన్న ఏక్తానగర్లో రెండు రోజలు పాటు జరిగే న్యాయశాఖ మంత్రులు, న్యాయ కార్యదర్శుల అఖిల భారత సదస్సును శనివారం ప్రధాని వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తూ గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం 1500కు పైగా పాతబడిన కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసిందని తెలుపుతూ వీటిలో అధిక భాగం బ్రిటీష్ పాలన కాలం నుంచి కొనసాగుతున్నవి ఉన్నాయని ఆయన చెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన ఈ అమృత్ కాల్లో ఈ సమస్యను ఎదుర్కోవడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, లోక్ అదాలత్‌లు లాంటి వ్యవస్థలు కోర్టులపై భారాన్ని తగ్గిచడానికి, ప్రజలు సులువుగా న్యాయం పొందడానికి తోడ్పడ్డాయని కూడా ప్రధాని తెలిపారు.
న్యాయవ్యవస్థలో ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని ప్రధాని గట్టిగా కోరుతూ ‘ఈజ్ ఆఫ్ జస్టిస్’ విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ‘చట్టాలు అస్పష్టంగా ఉండడం సంక్లిష్టతను సృష్టిస్తుంది. చట్టం గనుక సామాన్యుడికి సమగ్రంగా అర్థమయ్యే విధంగా ఉన్నప్పుడు అది ఎంతో ప్రభావం చూపిస్తుంది’ అని మోదీ తెలిపారు.
కొన్ని దేశాల్లో చట్టాన్ని రూపొందించినప్పుడు దాన్ని రెండు మార్గాల్లో నిర్ణయిస్తారు. సాంకేతిక పరిభాషను ఉపయోగించి దానిలోని చట్టపరమైన నిబంధనలకు వివరణాత్మక వివరణ ఇవ్వడం అందులో ఒకటి కాగా, సామాన్యుడు కూడా అర్థం చేసుకోవడం కోసం దాన్ని ప్రాంతీయ భాషలో రాయడం మరోకటని ప్రధాని పేర్కొన్నారు.
అందువల్ల చట్టాన్ని రూపొందించేటప్పుడు కొత్త చట్టాన్ని పేదలు కూడా అర్థం చేసుకునేలా ఉండడంపై మన దృష్టి ఉండాలని మోదీ సూచించారు. అలా ఒక విధంగా చట్టాన్ని రూపొందించినప్పుడే దాని వయసు, కాలం చెల్లే తేదీ రెండూ కూడా నిర్ధారణ అవుతాయి. నిర్దేశించిన తేదీ వచ్చినప్పుడు కొత్త పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సమీక్షిస్తారు. మన దేశంలో కూడా మనం అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.