కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ రోజు దేశంలోనే మొట్ట మొదటి హిందీ ఎంబిబిఎస్ కోర్సును ప్రారంభించారు. అజాదికా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో వైద్య రంగానికి ఈ రోజు చాలా ముఖ్యమైనదని, రాబోయే కాలంలో దీనిని సువర్ణాక్షరాలతో రాస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
మెడికల్ బయోకెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియోలజీ సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలను ఆయన ఆవిష్కరిస్తూ కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా.. మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
దేశంలో తొలిసారి హిందీ లో వైద్యవిద్యను ప్రారంభించడం ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మోడీ కలను నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే మధ్యప్రదేశ్ లో హిందీలో మెడిసిన్ విద్య అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
మోదీ నాయకత్వంలో ఈ రోజు కొత్త న్యూ విద్యా విధానం మన భాషలకు ప్రాముఖ్యతను ఇవ్వడం మొదలు పెట్టిందని చెబుతూ జేఈఈ, నీట్, యూజీసీ పరీక్షలను దేశంలోని 12 భాషల్లో నిర్వహించడం ప్రారంభించామని అమిత్ షా గుర్తు చేశారు.
అదేవిధంగా, కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తున్నారని, ఇంకా 10 రాష్ట్రాలు ఇంజనీరింగ్ కోర్సులను తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం ,గుజరాతీ భాషలలో బోధించడం ప్రారంభించాయని వివరించారు. సొంత భాషలో అధ్యయనం చేయడం వల్ల విద్యార్థుల సామర్థ్యాలు ఖచ్చితంగా పెరుగుతాయని స్పష్టం చేశారు.
కాగా, మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజే సింధియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనం, విస్తరణకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. కొత్త టెర్మినల్ భవనాన్ని రూ. 446 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.