ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు అడ్డుచెప్పడంతో ఆదివారం విశాఖపట్నంలో జరుపదలచిన `జనవాణి’ కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన రెండో రోజూ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మంత్రులపై దాడి చేశారనే అభియోగంపై జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తరువాత పవన్ విశాఖలో ఎటువంటి కార్యక్రమాలనూ కొద్ది రోజుల వరకూ నిర్వహించకూడదని నోటీసులు ఇవ్వడం, తక్షణం విశాఖ నగరం విడిచి వెళ్లిపోవాలని పోలీసులు ఆజ్ఞలు జారీ చేయడం, తన కార్యకర్తలను విడిచిపెట్టే వరకూ కదిలేది లేదని పవన్ భీష్మించుకు కూర్చోవడం… వంటి ఘటనలతో విశాఖ నగరం వేడెక్కింది.
తనకు పోలీసులు నోటీసులివ్వడంపై పవన్ మండిపడ్డారు. నేర చరిత్ర కలిగిన వారు అధికారంలో ఉంటే ఇలాగే ఉంటుందని ధ్వజమెత్తారు. ప్రాంతాలు, కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బలంగా పనిచేస్తోందని, బలహీనులపైన బలప్రయోగం చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.
‘జనవాణి’ కోసం ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల క్రితమే తాము నిర్ణయించామన్నారు. మూడు రాజధానులపై కార్యక్రమం ప్రకటించడానికి మూడు రోజుల ముందే తాము విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని చెప్పారు. తమ కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో జనవాణిని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రశాంత విశాఖ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లు సృష్టిస్తోందని విమర్శించారు.
హత్యాయత్నం చేస్తే పెట్టే 307 సెక్షన్ కేసును తమ పార్టీ నాయకులపై పెట్టారని, జనవాణి కార్యక్రమం అనుమతి పత్రంపై సంతకాలు చేసిన 14 మందిని అరెస్ట్ చేశారని పేర్కొంటూ భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్తామని హెచ్చరించారు. పోలీసులు మొత్తం 76 మందిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జిల్లా జడ్జి ముందు హాజరు పర్చారు.
ప్రజాసమస్యలు వినిపించడానికి వస్తే ఇన్ని ఆంక్షలా? అంటూ నిలదీశారు. వైసీపీ నేతలకు బూతుల పంచాంగం వినిపించడం మాత్రమే తెలుసని అంటూ రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారిస్తే ఎట్లా? అంటూ ప్రశ్నించారు.
ఎయిర్పోర్డులో జరిగిన దాడిపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇది కూడా కోడి కత్తిలాంటి చర్యేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పోలీసులు ప్రభుత్వ ప్రతినిధుల్లా ప్రవర్తిస్తున్నారని, ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. డిసిపి స్థాయి అధికారి తనను కవ్వించే ప్రయత్నం చేశారని, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తాను ఎంతో ఓపికగా ఉన్నానని చెప్పారు.
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం శనివారం సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్ కు పార్టీ శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించినా విచిత్ర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. శనివారం సాయంత్రం చీకటిపడే సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్, ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులోని నోవాటెల్ కు ర్యాలీగా బయలుదేరారు.
ఈ సందర్భంగా పవన్ ర్యాలీ సాగే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ లైట్లు బంద్ అయ్యాయి. అయినా వెనక్కు తగ్గని పవన్ కల్యాణ్ చీకట్లోనే ర్యాలీతో ముందుకు సాగారు.