నియంతృత్వ పోకడలు సాగిస్తున్న కేసీఆర్ తీరు నచ్చక బీజేపీలో చేరడానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. కొంత మంది తెరాస ప్రజాప్రతినిధులు కమలం గూటికి వచ్చేందుకు రాయబారాలు నడుపుతున్నారని వెల్లడించారు. పార్టీలో చేరేవారి పూర్తి వివరాలను పరిశీలించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం మునుగోడు వెళుతున్న బండి సంజయ్ రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా ఇంట్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే వారిని మాత్రమే చేర్చుకుంటామని.. భూ కబ్జాదారులు, ప్రజల కోసం పనిచేసే నిబద్ధత లేని వారిని పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక మరో గుణపాఠం అవుతుందని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రిగూడలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, కేసీఆర్ ఒక్క రోజు కూడా సమయం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పదవికి రాజీనామా చేశారని, దీంతో ఉప ఎన్నికలో ఓడిపోతాననే భయంతో కేసీఆర్ మునుగోడుకు నిధులు ఇస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టులకు తాము వ్యతిరేకం కాదని, కమ్యూనిస్టుల సిద్ధాంతాలు, బీజేపీ సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయన్నారు. వారంటే తమకు అభిమానమని సంజయ్ చెప్పారు.
రైల్వేకు కేసీఆర్ భూములివ్వడం లేదు : త్వరలోనే హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ముందు గా హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-బెంగళూరు మార్గాలలో ఏదో ఒక రూట్లో సేవలు ప్రారంభమవుతాయన్నారు. అంబేడ్కర్ సర్క్యూట్(మౌ, నాగ్‌పూర్, ఢిల్లీ, ముంబై)ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. మంగళవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు
భూ సేకరణ విషయంలో కేసీఆర్ సర్కారు జాప్యం వల్లే కీలకమైన ప్రాజెక్టులు పూర్తికావడం లేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్ రెండో విడత కోసం కేంద్రం వాటాను అందజేసిందని, రాష్ట్ర సర్కారు రూ.545 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు రూ.180 కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా, అధికారులను కలిసినా కేసీఆర్ సర్కారు నుంచి స్పందన లేదన్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఎంఎంటీఎస్ 2వ దశ అంచనాలు రూ.301 కోట్లు పెరిగాయని చెప్పారు. కాగా, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ బీజేపీలోకి వెళుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కిషన్‌రెడ్డి ఖండించారు.
నేడు బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్, బుధవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిసింది. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్‌ను ఢిల్లీలో బూర నర్సయ్యగౌడ్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నానని బూర నర్సయ్య చెప్పారు.