బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విజేతగా మోస్ట్ ఎంటర్టైనర్ సన్నీ అవతరించాడు. తనే విన్నర్ అని ప్రకటించగానే సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు రన్నరప్‌గా యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ నిలిచాడు.
19 మంది పోటీదారులతో మొదలైన ఈ షో సుమారు 105 రోజుల పాటు సాగింది. చివరకు పోటీదారులుగా సిరి, షణ్ముఖ్, మానస్, విజె సన్నీ, శ్రీరామ చంద్ర మిగిలారు. అలియాభట్, రణబీర్ కపూర్, రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్, రష్మిక, నాగ చైతన్య, నాని, సాయి పల్లవి, కృతిక శెట్టి, ఫరియా అబ్దుల్లా వంటి ప్రముఖులు వచ్చి అలరించారు.
హౌస్ నుండి వెళ్లిన పోటీదారులు తమదైన శైలిలో ఎంటర్టైన్ చేశారు. చివరి రోజు సిరి, మానస్, శ్రీరామ్ చంద్రలను వచ్చిన అతిధులతో ఎలిమినేట్ చేయించి, హౌస్ నుండి బయటకు రప్పించగా, నాగార్జున చివరకు పోటీలో మిగిలిన సన్నీ, షణ్ముఖ్ లను వేదిక మీదకు తీసుకువచ్చారు. చివరకు సన్నీని విజేతగా ప్రకటించారు.
విజేతగా ప్రకటించగానే సన్నీ సంతోషంతో నాగార్జునను ఎత్తుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని అతడి తల్లి భావోద్వేగానికి లోనైంది. ఇక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు.
తనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించినప్పటికీ సన్నీని దాటలేకపోయాడు. దీంతో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. విజేతగా అవతరించిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు.
అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టివిఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని ప్రకటించాడు.
కాగా, మరో రెండు నెలల్లో కొత్త సీజన్ ప్రారంభం కానుందని వ్యాఖ్యత నాగార్జున వెల్లడించారు.సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి 5 నెలలు పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్ 6 సీజన్‌ను అంతకు ముందే మీ ముందుకు తీసుకురాబోతున్నాము. కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకు బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలు కానుంది’ అని తెలిపాడు.