బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు టీఆర్ఎస్ నేతలు సమాధి కట్టడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. బతికున్నవాళ్లకు సమాధి కడతారా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్యలే లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు సహా ఇఛ్చిన హామీలన్నీ విస్మరించిన నీకు తెలంగాణలో ఎన్ని సమాధులు కట్టాలి? అంటూ ప్రశ్నించారు.
ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్నది కమ్యూనిస్టు నేతేనని… ఆ కేసును మాఫీ చేసేందుకే కమ్యూనిస్టు పార్టీని, కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపదొస్తే ఆదుకునే పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనుగోడు ఎన్నికల్లో ధీటైన వ్యక్తే లేరని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్ ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మాట తప్పినవ్… వాళ్లంతా నీకు సమాధి కడితే ఊరుకుంటావా? అంటూ నిలదీశారు. కేసీఆర్ కు మునుగోడు ఎన్నికలంటేనే వణుకు పుడుతోంది. అందుకే జ్వరం పట్టుకుంది. కొడుకేమో ట్విట్టర్లో,… బిడ్డ లిక్కర్లో… అల్లుడు దొంగ మాటల్లో….సడ్డకుడి కొడుకు కమీషన్లలో…ఇదీ కేసీఆర్ కుటుంబం తీరు అంటూ ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికలొస్తేనే సీఎం వస్తడు.. రోడ్లంటడు… పెన్షన్లు, రేషన్ కార్డులంటడు. ఎన్నికలు కాంగనే మళ్లీ పోయి ఫాంహౌజ్ లో పడుకునే వ్యక్తి కేసీఆర్….రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే చౌటుప్పల్ కు రోడ్డు వచ్చింది. గట్టుప్పల్ మండలం వచ్చింది. చేనేత బంధు వచ్చింది. పెన్షన్లు వచ్చినయ్… బస్తీ దవాఖానా రాబోతోంది అంటూ పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి జరగాలంటే మునుగోడులో టీఆర్ఎస్ ను తరిమితరిమికొట్టాలే…. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించాలని సంజయ్ పిలుపిచ్చారు.