బంగ్లా యుద్ధం – 5
స్వాతంత్య్రానంతర కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం, 1971లో పాకిస్తాన్‌పై భారతదేశం నిర్ణయాత్మక విజయం సాధించి, బంగ్లాదేశ్ అనే ఒక స్వతంత్ర దేశాన్ని సృష్టించడం. 93,000 మంది పాకిస్తాన్ సేనలను యుద్ధ ఖైదీలుగా తీసుకోవడం. భారత దేశ రక్షణ దృష్ట్యా, దక్షిణాసియాలో భౌగోలిక పరిస్థితుల దృష్ట్యా ఈ యుద్ధం ఒక కీలక మైలురాయి అని చెప్పవచ్చు.
ఎవ్వరు ఊహించని విధంగా, కేవలం 13 రోజులలో పాక్ సేనలు లొంగిపోయే విధంగా చేయడంలో సామ్ బహదూర్ అని విస్తృతంగా పిలువబడే మన సేనాధిపతి ఫీల్డ్ మార్షల్ సామ్ హోర్ముస్జీ ఫ్రామ్జీ జంషెడ్జీ మానెక్ షా కీలక పాత్ర వహించారు. ఆయన ప్రదర్శించిన ముందుచూపు, వ్యూహాత్మక ఎత్తుగడలు కీలక భూమిక వహించాయని చెప్పవచ్చు.
వాస్తవానికి ఆరు నెలల ముందుగానే, ఏప్రిల్ లోనే యుద్ధం ప్రారంభించాలని నాటి ప్రధాని ఇందిరా గాంధీ అభిలషించారు. ఆ విధంగా చేస్తే భారత్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కాగలవని నిర్వార్ధంగా చెప్పి మానెక్ షా ఆమెను వారించారు. “నా పని పోరాడడం, గెలవడమే నా పని” అంటూ ఆమెతో వాస్తవ పరిస్థితులను అరమరికలు లేకుండా వివరించే సాహసం చేయగలిగారు.
ప్రపంచ చరిత్రలోనే ఒక యుద్ధం కారణంగా ఒక కొత్త దేశం ఏర్పడిన చివరి ఘటన ఈ యుద్ధమే కావడం విశేషం. అంతటి మహత్తర యుద్ధం జరిపి, 93,000 మంది శత్రు సైనికులు లొంగిపోయినా ఎటువంటి మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు రాకపోవడం కూడా ఆయన నాయకత్వ విశిష్టత అని చెప్పవచ్చు. పైగా, లొంగి పోయిన పాక్ సేనలను మూడు రోజుల పాటు బాంగ్లాదేశ్ లో తిరుగుబాటు దారుల నుండి కాపాడారు.
వారిని సురక్ష స్థావరాలకు తరలించి, వారి వసతి, ఆహరం ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. యుద్ధంలో గెలుపు కోసం సైనిక విలువలను త్యాగం చేయని ధీశాలి. దారిలో గాని, యుద్ధం సమయంలో గాని సాధారణ ప్రజలను వేధించినట్లు, మహళలపై అత్యాచారాలకు పాలపడిన్నట్లు ఎటువంటి ఆరోపణలు భారత సైన్యంపై రాకపోవడం గమనార్హం.
వైరుధ్యాలతో ఏర్పడిన పాక్
అసలు ఈ యుద్ధం ఏ విధంగా ప్రారంభమై, భారత్ నిర్ణయాత్మక విజయానికి దారితీసిందో నేటి యువతకు అవగహన లేదని చెప్పవచ్చు. దేశ జనాభాలో వారే 65 శాతంగా ఉన్నారు.
1947లో పాకిస్ధాన్ ఏర్పడిన సమయంలోనే మధ్యలో భారత్ భూభాగం ఉండేవిధంగా, పశ్చిమ, తూర్పు భాగాలుగా ఆ దేశం ఏర్పడడంలోనే భౌగోలిక పరంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా వైరుధ్యాలు చోటుచేసుకున్నాయి. పాక్ పాలకులు ఈ వైరుధ్యాలను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేయకుండా, తూర్పు పాకిస్థాన్ ప్రజలపై ఆధిపత్య ధోరణులు ప్రదర్శనచడం ఈ యుద్దానికి ప్రాతిపదిక ఏర్పర్చిన్నట్లు చెప్పవచ్చు.
సార్వత్రిక ఎన్నికలలో తూర్పు పాకిస్థాన్ ప్రజలు షేక్ ముజిబుర్ రెహ్మాన్ నేతృత్వంలోని అవామీ లీగ్‌కు అఖండ విజయం చేకూర్చారు. మొత్తం 300 సీట్లలో అవామీ లీగ్ 160 సీట్లు గెలుచుకోగా, 84 సీట్లు జుల్ఫికర్ అలీ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువ జనాభా ఉన్నందున పాకిస్తాన్ శాసనసభ, నేషనల్ అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఉన్నాయి.
పాకిస్తాన్లో పౌర ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అది బెంగాలీలు సమర్థంగా పాలించగలరని పంజాబీ ఆధిపత్య పాకిస్తాన్ సైన్యం, , జుల్ఫికర్ భుట్టో ఆందోళన చెందారు. అందుకనే అన్ని సీట్లు గెలుపొందిన ముజిబుర్ రెహ్మాన్ కు అధికారం అప్పచెప్పడానికి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 7, 1970 నుండి ఎన్నికలు జరిగినప్పటి నుండి మార్చి 23, 1971 వరకు అనేక సంఘటనలు జరిగాయి. అన్నింటినీ భారతదేశ వ్యూహాత్మక నిపుణులు ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. ఎన్నికలకు ఒక నెల ముందు భారీ తుఫాను సంభవించింది. ఈ సందర్భంగా తూర్పు పాకిస్తాన్లో 50 లక్షల మంది వరకు మృత్యుకు లోనుకావలసి వచ్చింది.
తమ ఇబ్బందుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని తూర్పు పాకిస్థాన్ ప్రాంత ప్రజలలో తీవ్ర అసంతృత్తి ఏర్పడింది. అది కూడా పశ్చిమ పాకిస్తాన్‌పై వారి ఆగ్రహానికి దారితీసింది. పాకిస్తాన్ సైన్యం భుట్టోతో కుమ్మక్కై ఏదో ఒక సాకుతో, షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను పాకిస్తాన్ తదుపరి ప్రభుత్వానికి (ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఏకైక ప్రభుత్వం, అది ఏర్పడినట్లయితే) అధిపతి కావడానికి అనుమతించలేదు.
1947 నుండి ఉర్దూను జాతీయ భాషగా విధించే ప్రయత్నంతో సహా అనేక వివాదాస్పద సమస్యలపై బెంగాలీ జనాభా ఇప్పటికే పాక్ ప్రభుత్వంలో ఉన్న నేతల పట్ల అసహనంగా ఉంటూ వస్తున్నారు. అటువంటి సమయంలో ఆపరేషన్ సెర్చ్‌లైట్ అనే కోడ్‌నేమ్‌తో భారీ సైనిక అణిచివేతకు దిగడంతో అగ్గిమీద ఆజ్యం పోసిన్నట్లయింది.
ఈ అణచివేత బెంగాలీ మేధావులలో పెద్ద భాగాన్ని నిర్మూలించడానికి, బెంగాలీ మహిళలపై సామూహిక అత్యాచారాలకు, అనేక మంది నాయకులను అరెస్టు చేయడానికి దారితీసింది. షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను డక్కాలో అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్‌కు తరలించారు.
ఏప్రిల్ లోనే యుద్ధం చేయాలన్న ఇందిరా
తూర్పు పాకిస్తాన్లో అత్యంత అస్థిరమైన పరిస్థితుల నేపథ్యంలో, షేక్ ముజీబ్ లేకపోవడంతో మిగిలిన నాయకత్వం సహాయం కోసం భారతదేశాన్ని అభ్యర్థించింది. ఆ సమయంలో భారత్ జోక్యం చేసుకొంటే పాకిస్థాన్ తో పూర్తి స్థాయి యుద్దానికి దారితీస్తుందని, పాక్ సైన్యం సర్వశక్తులు ఒడ్డి ప్రఘటించే ప్రయత్నం చేస్తుందని తెలిసినా నాటి రాజకీయ నాయకత్వం (ఇందిరా గాంధీ) వెంటనే జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా భద్రతా వ్యవహారాలపై జరిగిన ఒక అత్యున్నత సమావేశంకు జనరల్ (తరువాత ఫీల్డ్ మార్షల్) సామ్ మానెక్ షాను ఆహ్వానించారు. తూర్పు పాకిస్తాన్లో భారత సైన్యంతో వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయనను కోరారు.
జోక్యం చేసుకోవడం అంటే యుద్దానికి దిగడమే అవుతుందని, ఆ యుద్ధం కేవలం తూర్పు వైపుకు పరిమితమై ఉండబోదని, పశ్చిమ దిశలో కూడా జరుగుతోందని స్పష్టం చేస్తూ, అటువంటి యుద్దానికి తాను సుముఖంగా లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అటువంటి యుద్దాన్ని కోరుకొంటుందా అని నేరుగా ఇందిరాగాంధీని అడిగారు.
ఆ విధంగా ఒక బలమైన దేశాధినేతకు సైన్యాధిపతి సమాధానం ఇవ్వడం ఆ రోజులలో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.
ఏదేమైనప్పటికీ, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రభుత్వాధినేతకు ఏ ఆర్మీ చీఫ్ అయినా ఇవ్వగలిగే తెలివిగల వ్యూహాత్మక సలహాతో మానెక్ షా ఒక ప్రత్యేక స్థానం పొందారు.
ఈ సందర్భంగా యుద్ధ ట్యాంక్ లకు అవసరమైన విడిభాగాలు, యుద్దానికి అవసరమైన మందుగుండు సామాగ్రి నిల్వలకు అవసరమైన నిధులు తనకు అందుబాటులో లేవని స్పష్టం చేశారు. వీటిని సమకూర్చు కోవడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పారు.
పైగా, ఆమె సూచిస్తున్నట్లు ఏప్రిల్-మే 1971 నెలలో యుద్ధంకు దిగితే భారత సాయుధ దళాలు పంజాబ్, రాజస్థాన్ వ్యవసాయ భూముల్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకోవాల్సి వస్తుందని, దాని వల్లన పంటలు నాశనమై మన దేశపు ఆహార నిల్వలు క్షీణించే ప్రమాదం ఉన్నదని కూడా ఆమె దృష్టికి తీసుకు వచ్చారు.
యుద్ధం ఎప్పుడైనా రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత చేసిన్నట్లయితే తూర్పు పాకిస్థాన్ నదులు సముద్రం వలే పొంగుతూ ఉంటె రోడ్ మార్గం తప్ప పాక్ సేనల కదలికకు వీలుండదని, పైగా, పశ్చిమ- తూర్పు ప్రాంతాలకు సేనలను అవసరమున్న చోటకు మార్చడం ఆ దేశానికి సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు.
వెంటనే యుద్దానికి వెడితే మంచు లేని హిమాలయ ప్రాంతాలలో పాకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామి చైనా కూడా కాలు దువ్వే అవకాశం ఉంటుందని, భారత్ కు అల్టిమేటం ఇచ్చే అవకాశం ఉంటుందని వారించారు. అందుకోసం భారత్ కొన్ని బలగాలను అటువైపు ఉంచవలసి వస్తుందని పేర్కొన్నారు.
రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత యుద్ధం చేస్తే హిమాలయ ప్రాంతంలో మన సేనల కదలికలను కనుక్కోవడం చైనాకు సాధ్యం కాదని, అప్పుడు వారు బెదిరించే అవకాశం ఉండదని తెలిపారు. యుద్దానికి తొందర పడకుండా, కొద్దీ రోజులు ఆగితే తూర్పు పాకిస్థాన్ లో అంతర్గత ప్రతిఘటన తీవ్రమైన పాకిస్తాన్ పట్టు ఆ భూభాగంపై కొంత బలహీన పడుతుందని మానెక్ షా పరిస్థితులను ఇందిరా గాంధీకి వివరించారు.
ఆ విధంగా నిర్ణయాత్మకంగా భారత్ విజయం సాధించగలదని భరోసా ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం ప్రారంభించాలని ఆయన ఇందిరకు సలహా ఇచ్చారు. ఏప్రిల్ – సెప్టెంబర్, 1971 మధ్యన కాకుకండా, ఆ తర్వాత ఎప్పుడైనా యుద్దానికి సైన్యం సిద్ధంగా ఉండగలదని భరోసా ఇచ్చారు. మానెక్ షాను వెంటనే యుద్ధంకు దిగడానికి ఒప్పించడం కోసం ఆ సమావేశంలో ఉన్న ప్రముఖులు అందరు తీవ్ర ప్రయత్నం చేసినా, ఆయన ఏమాత్రం చలించలేదు.
ఫలించిన మానెక్ షా వ్యూహం
ఆ తర్వాత ప్రధానితో ఒంటరిగా సమావేశమైనప్పుడు, మీరు అనుకున్న విధంగా యుద్ధం చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేయండి అని ఆమె ఆదేశాలు ఇచ్చారు. అందుకనే భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో అమెరికా వంటి దేశాలకు సహితం విస్మయం కలిగించే రీతిలో నిర్ణయాత్మక విజయంను భారత సైన్యం నమోదు చేసుకోగలిగింది.
ఆ వ్యవధిలో మన సేనలను యుద్దానికి సిద్ధం చేయడమే కాకుండా, యుద్ధంకు సిద్ధంగా ఉన్న ప్రతి సైనికుడి మనస్సులో `మనం విజయం సాధించాలి’ అనే ప్రగాఢమైన ఆకాంక్షను కూడా కలిగించారు. ఆ మానసిక భరోసా భారత్ అనూహ్య విజయం సాధించడానికి తోడ్పడింది.
“ఒకరి మనస్సులో విజయ స్పృహ ముందుగా నింపబడితే, అతను యుద్ధరంగంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఆ మంత్రం ఫలితంగానే 1971లో ఘన విజయం సాధించాం’’ అని ఆయన కుమార్తె మజా దారువాలా యుద్ధం సమయంలో 26 ఏళ్ళ వయస్సులో ఉన్న ఆమె పేర్కొన్నారు. ఆ మానసిక శక్తితోనే భారత సైన్యం సగర్వంగా పోరాడింది. ఆ భరోసానే నేటికీ అద్భుతంగా ప్రకాశిస్తోందని చెప్పవచ్చు.
మానెక్ షా అంచనా వేసిన్నట్లుగానే ఏప్రిల్-నవంబర్ 1971 వరకు, తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలు సృష్టించబడిన స్థానిక దళమైన ముక్తి బహిని పాకిస్తాన్ సైన్యం పట్టు, ధైర్యంలను క్రమపద్ధతిలో బలహీనం చేయగలిగాయి. పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా కొంతవరకు మద్దతు కూడదీసుకున్నా, ఒక విధంగా భారత్ ను అమెరికా అండతో ఒంటరిగా చేయగలిగిన, వారి జనరల్స్ చేసిన పొరపాట్లు, భారత్ సైన్యం వ్యూహాత్మక ఎత్తుగడలు వారిని మట్టి కురిపించాయి.
పాకిస్థాన్ కు అమెరికా బాసటగా నిలబడటమే కాకుండా, భారత్ ను సైనికంగా కూడా బెదిరించే ప్రయత్నం చేయడంతో ఈ యుద్ధం తర్వాత ఇండో – సోవియట్ పరస్పర స్నేహ ఒప్పందంపై రెండు దేశాల అధినేతలు సంతకం చేయడానికి దారితీసింది. అమెరికా నుండి ఎదురు కాగల సైనిక ముప్పును సమతుల్యం చేయడం కోసం భారత్ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయగలిగింది.
ఎవరీ మానెక్ షా?
ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా 1914 ఏప్రిల్ 3న అమృత్‌సర్‌లో జన్మించారు. ఆయన తండ్రి, హార్ముస్జి మానేక్షా, వైద్యుడు. తన తండ్రికి అభీష్టానికి ధిక్కరిస్తూ జూలై 1932లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేశారు. రెండు సంవత్సరాల తరువాత, అతను 4/12 ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో నీయమితులయ్యారు.
ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడారు 1960లలో కొన్ని సంవత్సరాల పాటు కోర్ట్ విచారణతో సహా కొంత గందరగోళం తర్వాత, మానెక్ షా 1969లో ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు.
1971 విజయం తర్వాత, జనరల్ మానేక్షా 59 సంవత్సరాల వయస్సులో ఫీల్డ్ మార్షల్ ఫైవ్-స్టార్ ర్యాంక్‌ను పొందారు. ఈ ఉత్సవ ర్యాంక్‌ను పొందిన మొదటి భారతీయ జనరల్ ఆయనే. పైగా ఆయనే భారత సైన్యంకు మొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్. కె ఎం కరియప్పకు 1986లో ఈ ర్యాంక్ లభించగా, అర్జన్ సింగ్‌కు 2002లో సమానమైన మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ వాయుసేనలో లభించింది.
1972లో, సామ్ బహదూర్‌కు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఒక సంవత్సరం తరువాత, ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవి నుండి రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత, తమిళనాడులో ఒక ఇంటిని కనుగోలు చేసి, వెల్లింగ్టన్లో తన చివరి రోజులు గడిపారు. 2008లో ఆయన తుది శ్వాస విడిచారు.
వచ్చే ఏడాది, నటుడు విక్కీ కౌశల్ ఆర్మీ వెటరన్‌పై సామ్ బహదూర్ అనే బయోపిక్‌లో నటించబోతున్నాడు. దీనికి ఫిల్మ్ మేకర్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్నారు.