భద్రాద్రి రాములవారి భూములు కబ్జా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. రెండవ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాములవారి 917 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ లో యదేచ్చగా కబ్జాకు గురవుతోందని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని పరిషత్ తప్పు పట్టింది.
రాముల వారి భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై, దేవాదాయశాఖపై ఉందని స్పష్టం చేసింది. కానీ ఈ విషయాన్ని విస్మరించి ఆంధ్ర ప్రదేశ్ లోని వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జా చేశారని వినోద్ కుమార్ మాట్లాడటం సిగ్గుచేటని మండిపడింది.
తెలంగాణ ఆస్తిని, శ్రీ రాముల వారి అస్తిత్వాన్ని ఇతరులు కబ్జా చేస్తుంటే కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, సహకార్యదర్శి బాను ప్రసాద్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఓ ప్రకటనలో నిలదీశారు.
భద్రాద్రి రాముడి భూములు కబ్జాకు గురవుతున్నాయని తాము ఆందోళనకు దిగేదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సందర్భంలో దేవాలయం తెలంగాణలో, భూములు ఆంధ్రాలో ఉన్నాయని వారు చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, ఎటపాక మండలం పురుషోత్తమ పట్నంలోని వందల ఎకరాల శ్రీరాముడి మాన్యాలు కబ్జాకు గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కబ్జాను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆందోళనకు దిగింది.
శుక్రవారం నాడు వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు భద్రాద్రి రాములవారిని దర్శించుకుని, అక్కడి ఎండోమెంట్ అధికారులతో పరిషత్ రాష్ట్ర బృందం చర్చించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ స్పందించారని వారు ఆరోపించారు.
రాష్ట్రం విడిపోయి తొమ్మిది సంవత్సరాలు గావస్తుందని, ఇంతకాలం ఆ భూములపై కనీసం స్పందించకపోవడం తెలంగాణ ప్రభుత్వం అలసత్వమేనని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతతోనే రాములవారి భూములు కబ్జాకు గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు విడిపోయిన మండలాల గురించి మాట్లాడే టిఆర్ఎస్ నేతలు దేవాలయ భూములను ఎందుకు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కోణాలను ముడిపెట్టి, దేవాలయ భూములపై మౌనం వహిస్తే రామభక్తులు సహించరని పరిషత్ నేతలు హెచ్చరించారు.
భద్రాచలం రాముడి భూములను న్యాయబద్ధంగా ప్రభుత్వమే పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించి రాముడి ఆస్తులను కాపాడాలని వారు కోరారు. లేదంటే రామ భక్తుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
దేవాలయం భూములు అంగుళం కూడా వదులుకోవద్దని పేర్కొంటూ అందుకు ఎండోమెంట్ మంత్రి, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు సూచించారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. రాముడి ఆస్తులను వదులుకుంటే అస్తిత్వాన్ని కోల్పోయినట్లేనని పరిషత్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనని వారు స్పష్టం చేశారు.