భారత దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాలలో మొదటి సారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ స్ట్రాత్ ఫీల్డ్ లో ఆవిష్కరించారు. భారత ప్రధానులుగా పనిచేసిన వారి విగ్రహాలు విదేశాలలో ఆవిష్కరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అదే విధంగా మహాత్మా గాంధీ తర్వాత భారత నేతల విగ్రహాలు విదేశాలలో నెలకొల్పడం కూడా ఇదే మొదటిసారి.
శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ ఫీల్డ్ హోంబుష్ కమ్యూనిటీ సెంటర్లో స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆవిష్కరించారు.
స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ ఉత్సవాలను జ్యోతి వెలిగించి, భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం చేసిన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేష్ బిగాల సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు విదేశాల్లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు.
50 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించామని చెబుతూ తాను 1995లో మొదటి సారిగా అస్ట్రేలియాకు వచ్చినప్పుడు స్ట్రాత్ ఫీల్డ్ లోనే నివసించానని, ఇప్పుడు అక్కడే మేయర్, కౌన్సిల్ అనుమతితో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు.
ఒక బిలియన్కుపైగా జనాభాకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చారిత్రాత్మకమైన రోజుగా చెప్పారు.
ఈ సందర్భంగా స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా అన్ని దేశాల ప్రజలను కలుపుకొనిపోయే సౌభ్రాతృత్వమున్న దేశమని తెలిపారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ పీవీని పదవులు ఎలా వరించాయి.. రాజకీయాలు, పరిపాలనలో పీవీ ముద్రలను వివరించారు. భారత దేశ ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పథకాలు, సంస్కరణలను ఎమ్మెల్సీ వాణీదేవి వివరించారు.
స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్లు సంధ్యారెడ్డి, రాజ్ దత్తా, శ్రీని పిల్లమర్రి, లివింగ్ స్టర్ చెట్టిపల్లి, పీవీ బంధువు డాక్టర్ హేమచంద్ర, ఇతర కుటుంబ సభ్యులు, డాక్టర్ భారతిరెడ్డి, హర్ మోహన్ వాలియాలతో పాటు స్థానిక ఇండియన్, తెలుగు, తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూచిపూడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.స్ట్రాత్ ఫీల్డ్ లో సుమారు 16 శాతం భారతీయులే నివసిస్తున్నారు. మరో ఐదు పీవీ విగ్రహాలను వేరే దేశాల్లో ఆవిష్కరించేలా ప్రణాళికను రూపొందించినట్టు మహేష్ బిగాల తెలిపారు.