మునుగోడులో ధర్మయుద్దం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలు మంచి చేస్తున్న మొనగాడు గెలవాలా? గడీల పాలనలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించి ఓటేయాలని మనుగోడు ప్రజలను కోరారు. హైదరాబాద్ లోని నాగోల్ అనంతుల గార్డెన్స్ లో మనుగోడు ప్రజలతో బీజేపీ నిర్వహించిన ‘‘ఆత్మీయ సమ్మేళనం’’లో మాట్లాడుతూ
టీఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిపోయారని, సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమవద్ద సమాచారం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నయ్ అంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తోందని ధ్వజమెత్తారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎక్కడా పోటీ చేయడం లేదని, ప్రచారానికి వెళితే మహిళలు తలుపులు మూసుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు.
తెలంగాణ భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలు ఇవ్వని చెబుతూ మోసపూరిత పాలనకు సమాధి కట్టే ఎన్నికలు అని చెప్పారు. పొరపాటున ఫలితాలు తారుమారైతే ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా, ఇంటికో ఉద్యోగం ఇయ్యకపోయినా, నిరుధ్యోగ భ్రుతి ఇవ్వకపోయినా, అవినీతికి పాల్పడినా, అరాచక పాలన కొనసాగించినా, జీతాలియ్యకపోయినా ప్రజలు ఆశీర్వదించారని కేసీఆర్ భావించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేసీఆర్ ఫాంహౌజ్ ను వీడి గల్లీలోకి వచ్చారంటే బీజేపీ చేస్తున్న పోరాటలే కారణం అని సంజయ్ స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ కేంద్రం ఎంతగానో నిధిలిస్తోందని చెబుతూ గ్రామాల్లో అంతో ఇంతో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని తెలిపారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో చెల్లని రూపాయి అంటూ ఇక బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో పట్టించుకునేదెవ్వరు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ నేతలకే లేదని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ డబ్బు, బంగారం, మందు, మాసం విచ్చలవిడిగా పంచుతోందని చెబుతూ పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదు? మంత్రుల, అధికార పార్టీ ఎమ్మెల్యేల వాహనాలను ఎందుకు తనిఖీ చేయరు? అని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్ర కాదు… కాంగ్రెస్-టీఆర్ఎస్ జోడీ యాత్ర. రెండు పార్టీలు కలిసి చేస్తున్న యాత్ర అంటూ రాహుల్ గాంధీ యాత్రపై మండిపడ్డారు.
ఇన్ని దశాబ్దాలలో కాంగ్రెస్ సాధించిదేమిటో చెప్పాలి? దేశానికి చేసిందేమిటో చెప్పాలి? అని నిలదీశారు. ఉద్యోగాల భర్తీ చేయకుండా 8 ఏళ్లుగా నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ సిగ్గు లేకుండా ఓట్లడుగుతున్నడని ధ్వజమెత్తారు. బీజేపీకి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.