దేశ సైనికులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కార్గిల్ లో జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు. గత ఏడాది జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్లో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలు చేసుకున్నారు.
సైనికులకు ప్రధాని మోదీ స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ”జవాన్లందరూ నా కుటుంబ సభ్యులే. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు. దేశ సైనికుల శౌర్యం అనంతం. జవాన్లతో కలిసి పండుగ జరుపుకోవడం గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.
ప్రపంచ శాంతికి తాము అనుకూలమని కార్గిల్ సైనికులతో ప్రధాని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని దాన్ని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగిస్తుందని స్పష్టం చేశారు. లంకలో జరిగినా, కురుక్షేత్రంలో జరిగినా చివరి వరకు యుద్ధాన్ని నిరోధించడానికే ప్రయత్నిస్తామని చెప్పారు.
సైనికులను తన కుటుంబంగా సంబోధించిన ప్రధాని.. వారు లేకుండా తాను దీపావళిని జరుపుకోలేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారి ధైర్యసాహసాలను కొనియాడారు. ఉగ్రవాదంపై పోరును కొనియాడుతూ.. వారి ధైర్యానికి ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ సాక్ష్యాలుగా నిలిచాయని తెలిపారు.
కార్గిల్లో మన సైనికులు తీవ్రవాదాన్ని అణిచివేశారని, ఆ ఘటనకు తానే సాక్షినని చెప్పారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్న మోడీ.. జవాన్లకు స్వీట్లు తినిపిస్తూ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో సైనికులు వందే మాతరం, భారత్ మాతాకీ జై నినాదాలు చేయగా.. ప్రధాని మోదీ వారితో గొంతు కలిపారు.
కాగా, సోమవారం ఉదయం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని ట్విట్టర్ వేదకగా శుభాకాంక్షలు తెలిపారు. ”అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కాంతి, ప్రకాశంతో ముడిపడిన పండుగ దీపావళి. ఈ శుభ తరుణంలో ప్రజలందరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు రెట్టింపు కాపాలని కోరుకుంటున్నాను. అంతా తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో అత్యద్భుతమైన దీపావళిని జరుపుకోవాలని ఆశిస్తున్నాను” అని ప్రధాని ట్వీట్ చేశారు.