ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు సుమారు రెండు గంటల సేపు నిలిచిపోవడంతో యూజర్లు అయోమయానికి గురయ్యారు. సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో తమ డేటా బ్యాలెన్స్ అయపోయిందేమోనని చెక్ చేసుకున్నారు. ట్విట్టర్లో వాకబు చేసుకున్నారు. అందరికీ అదే సమస్య ఉందని తెలుసుకుని కుదుటపడ్డారు.
సేవలు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన వాట్సాప్ వెంటనే సమస్యను కనిపెట్టేందుకు ప్రయత్నించింది. చివరికి 2.21 గంటల తర్వాత సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అయితే, సేవలు నిలిచిపోవడానికి కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి సేవలు నిలిచిపోయినట్లు డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ద్వారా తెలిసింది. గ్రూపుల్లో మెసేజులు వెళ్లడం లేదని, వ్యక్తిగత మెసేజులు పంపిస్తే బ్లూటిక్ రావడం లేదని పలువురు వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు.
వాట్సాప్ వెబ్‌కి కనెక్ట్ చేస్తున్నప్పుడు ‘కనెక్టింగ్’ అని కొన్నిసార్లు, నెట్వర్క్ కనెక్టివిటీ లేదు అని కొన్నిసార్లు వస్తున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. సేవల అంతరాయంపై వాట్సాప్ మాతఅ సంస్థ మెటా స్పందించింది. సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
వాట్సాప్ పనిచేయడం లేదని తెలియడంతో అప్పుడే నెటిజన్లు ఫన్నీ మీమ్స్ రూపొందిస్తున్నారు. వాట్సాప్ యూజర్లంతా ట్విటర్ వైపు పరుగులు తీస్తున్నారని ఒకరు కామెంట్ పెడితే.. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందంటూ మరొకరు ట్వీట్ చేశారు.
కాగా, వాట్సాప్ సేవలకు దాదాపు రెండు గంటలపాటు అంతరాయం కలగడం ఇదే తొలిసారి. వాట్సాప్ ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసేందుకు కోట్లాదిమంది ఉపయోగిస్తుండడంతో కాసేపు ఆగిపోతే చాలు యూజర్లు అల్లాడిపోతుంటారు.
అలాంటిది గంటలపాటు ఆగిపోవడంతో ఏమైందో తెలియక జనం గందరగోళానికి గురయ్యారు. వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడినప్పటికీ మెటా ఇతర ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మాత్రం యథావిధిగా పనిచేశాయి. ప్రస్తుతం వాట్సాప్ బాగానే పనిచేస్తోంది. ఒకవేళ ఇంకా ఇబ్బందిగా ఉంటే ఫోన్ రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.