మరో వారం రోజులలో కీలకమైన ఉపఎన్నిక జరుగుతుండగా, నలుగురు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేసేందుకు బిజెపి బేరాలు ఆడుతున్నట్లు బుధవారం రాత్రి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయడం రాజకీయ దుమారం రేపింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తున్న ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని ఒక వంక టిఆర్ఎస్, మరో వంక బిజెపి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ ఉదంతంతం రాజకీయ సంచలనం కలిగిస్తున్నది.
ఎట్లాగూ తమకు ఓటమి తప్పదనే భయంతో బిజెపి ఈ దురాగతానికి దిగినదని టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా, ఇదంతా ఓ రాజకీయ డ్రామా అంటూ బిజెపి నాయకులు కొట్టిపారేస్తున్నారు.
ఎంఎల్ఎలు ఇచ్చిన సమాచారం మేరకు తాము ఫాంహౌజ్‌ను ముట్టడించి బేరసారాలకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వి చారిస్తున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. ఎంఎల్ఎలు ఇచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు హైదరాబాద్ శివార్లలోని పివిఆర్ ఫామ్‌హౌస్‌లో దాడులు చేశారు.
డబ్బు కట్టలతో ఫరీదాబాద్‌కు చెందిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌లు హైదరాబాద్‌లో పట్టుబడ్డారని చెబుతున్నారు. వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని, ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారని చెబుతున్నారు.
టిఆర్ఎస్ ఎంఎల్ఎలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డిలు ఈ సమాచారం ఇచ్చారని, ఫామ్ హౌస్‌లో దాడులు చేశామని పోలీసుల కధనం నడుస్తున్నది. తెలంగాణలో మరో ఏక్నాథ్ షిండే వస్తాడంటూ బిజెపి అగ్రనేతలు పలు సందర్భాల్లో పేర్కొనడం, పలువురు టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతూ ఉండడంతో ఈ ఉదంతం అధికార పక్షానికి ఉపఎన్నిక ముందో అవకాశంగా లభించినట్లయింది.
అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని తెలియడంతో కేసీఆర్ బీజేపీని బద్నాం చేసేందుకు ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారంటూ ఆయన మండిపడ్డారు.
కేసీఆర్‌కు దమ్ముంటే.. ఈ వ్యవహారానికి సంబంధించి ఫాంహౌజ్‌లో, హోటల్లో, ప్రగతి భవన్లో గత వారం రోజులుగా జరిగిన సన్నివేశాలకు సంబంధించి సీసీ పుటేజీలన్నీ బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. దీంతో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమేలేదని చెప్పారు.
ఇదే విషయంపై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే.. భార్య పిల్లలతో కలిసి యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే వార్తలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. అలాంటి అవసరం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఇదంతా ఒక నాటకాన్ని తలిపిస్తోందని చెబుతూ రూ. 100 కోట్ల రూపాయల డబ్బు మా దగ్గర ఎక్కడిదని ప్రశ్నించారు. అయినా, వాళ్లు 100 కోట్ల రూపాయల ఖరీదైన వ్యక్తులా? అంటూ ఆరోపణలను కొట్టిపారవేసారు.