పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్‌కు గట్టి హెచ్చరికలు పంపారు. పీఓకేలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని..వీటిపై పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అంతేకాదు..త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని గురువారం నిర్వహించిన శౌర్యదివస్ కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. “జమ్మూ, కశ్మీర్, అడఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్థాన్‌లను చేరుకున్నాకే మా లక్షంనెరవేరుతుంది. పిఓకె ప్రజలపై పొరుగుదేశం అకృత్యాలకు పాల్పడుతోంది. పిఓకె ప్రజలు అనుభవిస్తున్న బాధ వారిని మాత్రమే కాదు, మనల్నికూడా బాధిస్తోంది. దాని పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు” అంటూ హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ మానవహక్కుల కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటోందని, కానీ పీవోకేలో మాత్రం ప్రజల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. పీవోకేలో ప్రజలు అనేక బాధలు పడుతున్నారని చెప్పారు. త్వరలో వారి బాధలను తొలగిస్తామని స్పష్టం చేశారు.
మోదీ నాయకత్వంలో 370 అర్టికల్‌ను రద్దు చేశామని రక్షణ మంత్రి గుర్తు చేశారు. దీని వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర ప్రాంతాలుగా మారిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. త్వరలో ఈ అభివృద్ధి ప్రయాణం గిల్గిట్, బాల్టిస్థాన్‌కు చేరుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా భారత సైన్యం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. జమ్మూ, కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్ 27న సైన్యం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లోని 1వ బెటాలియన్ అద్భుతమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది.దీన్ని పురస్కరించుకుని ఆర్మీ ఇన్ఫాంట్రీ డేను జరుపుకొంటుంది.
మరో వైపు ఆ యుద్ధంలో వాయుసేన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది కూడా అక్టోబర్ 27నే. ఈ నేపథ్యంలో సైన్యం, వాయుసేన కలిసి శౌర్య దివస్‌ను నిర్వహిచుకొంటున్నాయి.శ్రీనగర్‌లో వాయుసేన బేస్ ఏర్పాటు చేసి ఈ రోజుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి.