తెలంగాణలో దుర్మార్గమైన కేసీఆర్ పాలన పోతేనే ప్రజల బతుకులు బాగుపడతాయని చెబుతూ మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇవ్వాలని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోరారు. ఇక్కడి ఓటర్ల తీర్పుతో తెలంగాణ రాత మారబోతోందని ఆయన చెప్పారు.
చండూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన రాజీనామా దెబ్బకి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ మునుగోడుకు క్యూ కట్టారని గుర్తు చేశారు. తనపై మునుగోడు ప్రజలకు ఎనలేని ప్రేమ ఉందని, అందుకే 2018లో గెలిపించారని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు బానిసలుగా మారారని ఆరోపించారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపిచ్చారు.
మునుగోడు ప్రజలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీలో ప్రభుత్వంపై తీవ్రంగా పోరాటం చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారం, డబ్బునే నమ్మకున్నారని..తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. శాసనసభలో ప్రశ్నించే గొంతును లేకుండా చేయాలనే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
తనకు జ్వరం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే డ్రామా అని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెబుతూ తన చివరి శ్వాస వరకు మునుగోడు ప్రజల కోసం పాటుపడతానని తెలిపారు. రూ.1000 కోట్ల తో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు.
కేసీఆర్ దగ్గర ఆత్మగౌరవాన్ని చంపుకుని ఉండలేక.. ఈటల రాజేందర్, బూరనర్సయ్య గౌడ్ లు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. డబ్బుకంటే ప్రజాశక్తి గొప్పదని మునుగోడు ప్రజలు నిరూపిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చింది బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసమని.. రాబోయే రోజుల్లో వారి కోసం కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపి కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందంటూ టీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తే కేసీఆర్ కు మతి భ్రమించినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారిని బీజేపీ ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. రూ. 100 కోట్లు అనేది చాలా పెద్ద డ్రామా అని ఆయన కొట్టిపారేశారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
