ఎమ్యెల్యేల కొనుగోలు ఉదంతం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) నేతలపై కేసు నమోదు చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ మీడియా హెడ్ అనిల్ బలూని, బీజేపీ ఎన్నికల కమిటీ నేత ఓం పాఠక్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది.
మనుగోడు ఉప-ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ రెండు పేజీల ఫిర్యాదు అందజేశారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీకి వస్తున్న స్పందన, ఆదరణ చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఈ క్రమంలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోడానికి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
వీటిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. ఇది చాలదన్నట్టుగా కాంగ్రెస్ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో ఓ తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. కొందరు వ్యక్తులు తనను కలిసి బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామంటూ ఆశ చూపినట్టుగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలు, ఒత్తిడితో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. తద్వారా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951లోని సెక్షన్ 123(4) ఉల్లంఘించారని ఆరోపించారు. మనుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎన్నికను ప్రభావితం చేసేలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం బయటికొచ్చి ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో అధికార పార్టీలు అనేక రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం అంటూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం అంతా డ్రామా.. కుట్ర అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. బీజేపీ తరఫున మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్న వ్యక్తులెవరో తమకు తెలియదని వెల్లడించారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము సంపూర్ణ మెజారిటీతో గెలుస్తామని, అలాంటప్పుడు ఈ నలుగురిని తీసుకుని ఏం చేస్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. కేసులు, ఆడియో టేపులు అన్నీ అల్లిన కట్టుకథలేనని ఆయన కొట్టిపడేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో టీఆర్ఎస్ ఓ కట్టుకథను అల్లిందని బీజేపీ క్రమశిక్షణ కమిటీ, ఎలక్షన్ కమిటీ నేత ఓం పాఠక్ కొట్టిపారవేసారు. ఆడియో టేపుల్లో బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించినంతమాత్రాన వారితో సంబంధం ఉన్నట్టు కాదని స్పష్టం చేశారు. తాను కూడా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేరు తీసుకుని ఏదైనా చెబితే నిజమైపోతుందా అని ఎదురు ప్రశ్నించారు. దేశంలో బ్రోకర్లకు, మధ్యవర్తులకు కొదవలేదని.. ఎవరో ఏదో చెబితే సంబంధం ఎలా అంటగడతారని ఆయన నిలదీశారు.