ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీ లాండరింగ్ వంటి నేరాలు సరిహద్దులు దాటి జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. హర్యానాలోని సూరజ్ కుండ్ లో హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన చింతన్ శివిర్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని అందుకనే నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 5 జీతో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉందన్న ప్రధాని… క్రిమినల్స్ కంటే 10 అడుగులు ముందు ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడి నేరాలను అరికట్టాలని సూచించారు.
ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ఒక రాష్ట్రానికే రిస్ట్రిక్ట్ అయింది కాదని, సాంకేతికతను క్రిమినల్స్ దుర్వినియోగ పరుస్తున్నారని చెబుతూ నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని చెప్పారు.ఈ సాంకేతికత భద్రతపై సామాన్యులలో విశ్వాసం నింపుతుంది కాబట్టి బడ్జెట్ పరిమితులకు అతీతంగా దీని అవసరంపై ఎక్కువగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రులు, హోం మంత్రులకు ఆయన సూచించారు.
ప్రతి రాష్ట్రంలోనూ వరుసలో చివరి వ్యక్తికీ ప్రయోజనాలను అందించే సుపరిపాలన ఇదే. శాంతిభద్రతల వ్యవస్థకు, రాష్ట్రాల అభివృద్ధికి మధ్యగల అవినాభావ సంబంధాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “విశ్వసనీయంగా ఉండటం శాంతిభద్రతల వ్యవస్థకు అత్యంత ముఖ్యం. ప్రజల్లో దానిపై విశ్వాసం, అవగాహన ఎంతో కీలకమైనవి” అని స్పష్టం చేశారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ‘ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్’లకు ప్రజల్లో గుర్తింపు పెరుగుతుండటాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా నేరం ప్రదేశానికి పోలీసులు చేరుకోవడాన్ని ప్రభుత్వమే తక్షణం తమవద్దకు వచ్చినట్లుగా ప్రజలు పరిగణిస్తారని చెప్పారు. కరోనా కాలంలో పోలీసుల సేవలతో ప్రజల్లో వారి ప్రతిష్ట పెరిగిందని ప్రధానమంత్రి కొనియాడారు.
వారిలో నిబద్ధత, విషయ పరిజ్ఞానాలకు లోటులేదని, పోలీసులపై ప్రజల్లో అవగాహన మరింత బలోపేతం కావాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ మేరకు వారికి మార్గనిర్దేశం చేయడం మన నిరంతర ప్రక్రియగా ఉండాలని స్పష్టం చేశారు.
అవినీతి, ఉగ్రవాదం, హవాలా నేరాలతో పటిష్టంగా వ్యవహరించగల సంకల్పం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాల్లో స్పష్టంగా ఉందని ప్రధాని అన్నారు. ముఖ్యంగా “ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరులో యుఎపిఎ’ వంటి చట్టాలు వ్యవస్థకు మరింత బలాన్నిచ్చాయి” అని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు.
దేశం లో రాష్ట్రాల పోలీసు బలగాలన్నిటికి ఒకే విధమైన యూనిఫార్మ్ ఉండే విషయాన్ని గురించి ఆలోచన చేయవలసిందిగా ప్రధాన మంత్రి సూచన చేశారు. ఇది స్థాయి పరంగా నాణ్యమైనటువంటి ఉత్పాదనలకు పూచీపడడం ఒక్కటే కాకుండా చట్టం అమలు యంత్రాంగానికి ఒక ఉమ్మడి గుర్తింపును ఇవ్వగలుగుతుందని, పౌరులు దేశం లో ఏ మూలన అయినా పోలీసు సిబ్బందిని ఇట్టే గుర్తు పట్టగలుగుతారు ప్రధాని వివరించారు.