పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావే గ్రేట్ మాస్టర్ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్స్ ఆర్ట్స్ లో ప్రఖ్యాత చిత్రకారుడు అక్బర్ సాహెబ్ గీసిన పెయింటింగ్స్ నుప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ డబ్బు ఎరజూపి పార్టీలో చేర్చుకునే నీచ సంస్కృతి బీజేపీలో లేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యవహారాల్లో కేసీఆర్ అందెవేసిన చేయి అని తెలిపారు.
కేసీఆర్ తొలి ప్రభుత్వంలో బీఎస్పీ, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే చేర్చుకుని, ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని, కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
నలుగురు ఎమ్మెల్యేలకు తలా రూ. 100 కోట్లు ఇస్తామన్నట్టుగా చెప్పారని, కానీ ఒక్క పైసా కూడా చూపలేకపోయారని కేంద్ర మంత్రి తెలిపారు. అయినా ఆ నలుగురూ రూ. 400 కోట్లు పెట్టి కొనాల్సినంత విలువైన వ్యక్తులా? అని ఆయన ప్రశ్నించారు. “నలుగురు పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదు.. బీజేపీ అధికారంలోకి రాదు. తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది బీజేపీనే” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే బీజేపీలో చేరాలనుకునేవారితో బేరసారాలకు చోటు లేదని, చేరేవారు నేరుగా పార్టీ నేతలను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. పార్టీలో చేరికల కోసం ఈటల రాజేందర్ నేతృత్వంలో ఒక కమిటీయే ఉందని గుర్తు చేశారు. పార్టీలో చేర్చుకోవడంలో తప్పేం ఉందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ప్రతిరోజూ వందలు, వేల సంఖ్యలో ప్రజలు తమ పార్టీని ఆశ్రయించే పరిస్థితుల్లో చేర్చుకునేవారికి డబ్బులివ్వాల్సిన అవసరం తమకెందుకు ఉంటుందని నిలదీసేరు.
ఇప్పటివరకు చేర్చుకున్నవారికి తాము డబ్బులిచ్చి చేర్చుకున్నామా? అంటూ ప్రశ్నించారు. చేరేవారు నేరుగా తననుగానీ, తమ పార్టీ నేతలను గానీ సంప్రదించవచ్చని, మధ్యవర్తులతో పనిలేదని స్పష్టం చేశారు. మధ్యవర్తుల పేరు చెప్పి టీఆర్ఎస్ అల్లిన కట్టుకథ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా బూమ్రాంగ్ అయిందని ఎద్దేవా చేశారు.
బీజేపీలో చేరేవారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టులు ఉండవని, అలాగే ఏ కేసుల నుంచి రక్షణ కూడా ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్లు, సైద్ధాంతికంగా బిజెపి పట్ల ఆకర్షితులయ్యేవారు చేరవచ్చని తెలిపారు.
అయితే పార్టీలో చేరేవారు తమ పదవులు వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈడీ, ఇన్కం ట్యాక్స్ కేసుల నుంచి రక్షణ ఉంటుందని ఎవరో స్వామీజీ చెబితే.. నిజమైపోతుందా అని ప్రశ్నించారు.