ఉగ్రవాదం ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో విస్తరిస్తోందని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ శనివారం తెలిపారు. ‘ఉగ్రవాదం అన్నది మానవాళికి గొప్ప ముప్పు’ అని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రెండు రోజుల ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.
కౌంటర్ టెర్రరిజం కమిటీ(సిటిసి) రెండు రోజుల సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం అన్నది భద్రతా మండలి ముఖ్యాంశంగా మారిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నవీన సాంకేతికత ప్రభుత్వాలకు కొత్త సవాళ్లను కూడా విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదం ముప్పు పెరుగుతోందని, ఈ జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్య సమితి చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నప్పటికీ, అది విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చారు. ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలకు, రెగ్యులేటరీ వ్యవస్థలకు నూతన సవాళ్లను విసురుతున్నాయని చెబుతూ ఉగ్రవాద నిరోధం లక్ష్యంగా ఆంక్షలను విధిస్తోందని పేర్కొన్నారు.
రాజ్యేతర శక్తులు ఉగ్రవాదంలో క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి ఉగ్రవాదులకు పనిముట్లుగా మారాయని ఆయన విమర్శించారు. ఈ ఏడాది ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు యుఎన్ ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ స్వచ్ఛందంగా అర మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు జయశంకర్ ప్రకటించారు.
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పట్ల ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఐరాస భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ చీఫ్ డేవిడ్ స్చరియా చెప్పారు. ముఖ్యమైన సమస్యగానూ, ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశంగానూ నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూస్తుందని తెలిపారు.
ఉగ్రవాదం వల్ల సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రపంచం మొత్తానికి ఉగ్రవాద సమస్య ఉండకూడదనే లక్ష్యంతో అంతర్జాతీయ పరిష్కారాలపై దృష్టి పెట్టినందుకు భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా అద్భుతమైన విషయమని తెలిపారు.
ఈ సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నదీ తెలిపే ప్రకటనను ఈ సమావేశాల అనంతరం విడుదల చేస్తామని చెప్పారు. ఉగ్రవాదులు నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను ఉపయోగించుకుంటుండటంపై అత్యున్నత స్థాయిలో ఈ సమావేశాల్లో చర్చించడం చాలా గొప్ప విజయమని చెప్పారు.