తీవ్రవాదమనేది మానవాళికి ఇప్పటికీ అత్యంత తీవ్రమైన ముప్పుల్లో ఒకటిగా వుందని విదేశాంగ మంత్రి జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రవాద నిరోధక కమిటీ (సిటిసి) రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఆవిర్భవిస్తును సాంకేతికతలను ఉపయోగించుకుని తలెత్తుతున్న తీవ్రవాద ముప్పులను ప్రస్తావించారు.
ఈ కమిటీ మొదటి రోజు సమావేశం ముంబయిలో జరిగింది. వివిధ దేశాలకు చెందిన మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు ఇంటర్నెట్ను, ద్రోన్లతో సహా మానవ రహిత వైమానిక వాహనాలను, అలాగే నిధుల కోసం క్రిప్టో కరెన్సీని ఇతర ఆన్లైన్ మార్గాలను ఉపయోగించుకోవడంపై చర్చ జరిగింది.
ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతలపై నైపుణ్యాలు సాధించడం ద్వారా తీవ్రవాద గ్రూపులు, వాటి సైద్ధాంతిక అనుచరులు తమ సామర్ధ్యాలను పెంచుకుంటున్నారని జై శంకర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్, ఇతర సామాజిక మాధ్యమ వేదికలనేవి తీవ్రవాదులకు, మిలిటెంట్ గ్రూపులకు అత్యంత సమర్ధవంతమైన సాధనాలుగా మారాయని హెచ్చరించారు. సమాచారాన్ని చేరవేయడానికి, కుట్ర సిద్దాంతాలను అమలు చేయడానికి వీటిని ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు.
2008 నవంబరు 26న ముంబయిలో జరిగిన దాడులు, 2005 జులై 7న లండన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడులకు మధ్య పోలికలు వున్నాయని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ చెప్పారు. తీవ్రవాద దాడుల బాధితులు ప్రపంచవ్యాప్తంగా వున్నారని అన్నారు. తీవ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
కొత్తగా వస్తును సాంకేతికతలతో దాడుల స్వభావం, తీవ్రవాద గ్రూపుల రిక్రూట్మెంట కూడా బాగా మారిపోయిందని చెప్పారు. తోరాబోరా గుహల్లో వుంటూ వాయిస్ రికార్డ్ చేసి పంపిణీ చేయడం దగ్గర నుండి అంతర్జాతీయంగా ఆన్లైన్ రిక్రూట్మెంట్, ప్రచారాలు, ప్రత్యక్ష దాడుల ప్రసారం వరకురెండు దశాబ్దాల కాలంలో చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
ఉగ్రవాదం ముప్పు పెరుగుతోందని, ఈ జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్య సమితి చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నప్పటికీ, అది మరింతగా విస్తరిస్తోందని తెలిపారు. ఐరాస కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్‌కు భారత దేశం ఈ ఏడాది 5 లక్షల డాలర్లను అందజేస్తుందని విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో సభ్య దేశాల సత్తాను పెంచేందుకు సహాయపడటం కోసం ఈ నిధులను ఇస్తామని ఆయన తెలిపారు.
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పట్ల ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఐరాస భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ చీఫ్ డేవిడ్ స్చరియా కొనియాడారు. ముఖ్యమైన సమస్యగానూ, ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశంగానూ నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూస్తుందని తెలిపారు.
డిజిటల్ రంగంలో మానవ హక్కులను పరిరక్షిస్తూనే ఈ దాడుల ముప్పును తగ్గించడానికి అన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనికోరుతూ ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు.