మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్/బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు. టోపీ పెట్టుకని వచ్చి గప్పాలు కొట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టి పోయారని పేర్కొన్నారు.
మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికలై పోగానే మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్కెచ్ వేశారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు గాడిదలెవరో… ఆవు ఎవరో నిర్ణయించుకున్నారని.. గాడిదలాంటి టీఆర్ఎస్ కు ఓటేయబోరన్నారని ధీమా వ్యక్తం చేశారు.
టీఎన్జీవో నేతలు కొందరు టీఆర్ఎస్ కు మద్దతివ్వడంపట్ల బండి సంజయ్ మండిపడ్డారు.‘‘ఉద్యోగులను ఏం ఉద్దరించారని మద్దతు తెలుపుతున్నారు? 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరని చేసినందుకా? జీతాలే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకా?‘’అంటూ ప్రశ్నించారు.
“మునుగోడు ఎన్నికలున్నందున నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పమని అడిగనం… కానీ ఆ ఊసే ఎత్తలేదు. గతంలో ఇచ్చిన హామీలతోపాటు మొన్న ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు. గౌడ కులస్తుల గురించి ప్రస్తావనే లేదు. యాదవుల సమస్యలు మాట్లాడలేదు. వడ్డెరలు, విశ్వకర్మలు, ఎస్టీ, ఎస్టీల ప్రస్తావనే లేదు. కుమ్మరి, కమ్మరి సహా ఎవరి గురించి ప్రస్తావించలే..” అంటూ సంజయ్ విమర్శించారు.
కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోందని, అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నడని ఎద్దేవా చేశారు. చేనేతల గురించి ప్రస్తావించిన కేసీఆర్… చేనేత సహకార ఎన్నికలు ఎందుకు జరపడం లేదు? నూలు వస్త్రాల రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైంది? చేనేత బంధు ఎంతమందికి ఇచ్చిండో? చెప్పలేదని నిలదీశారు. జీఎస్టీ గురించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు? జీఎస్టీ వేయాలని మంత్రి హరీష్ రావు చెప్పిన విషయం మర్చిపోయినవా? అంటూ ప్రశ్నించారు.
మరి డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఎందుకు ఇయ్యలే? ఉద్యోగాలెందుకు ఇయ్యలే? ఈడ ఉద్యోగాలు రాక వేలాదిమంది యువత డ్రైవర్లుగా హైదరాబాద్ వలసపోయిండ్రని ధ్వజమెత్తారు.
శివన్నగూడెం రిజర్వాయర్ పనులను కేంద్రం ఆపిందని పచ్చి అబద్దాలు వల్లించిండు… ఇప్పుడేమో 15 రోజుల్లో పూర్తి చేస్తానని కథలు చెబుతున్నడని మండిపడ్డారు. ఫ్లోరైడ్ సమస్యపైనా అబద్దాలు చెప్పిండని అంటూ క్రిష్ణా జలాలను హైదరాబాద్ తీసుకుపోయే సమయంలో మునుగోడు సహా ఫ్లోరోసిస్ ప్రాంతాలకు తెలంగాణ రాకముందే నీళ్లు వచ్చినయ్ అని సంజయ్ గుర్తు చేశారు.
బిడ్డ లిక్కర్ కేసు.. కొడుకు డ్రగ్స్ కేసు… టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిండ్రు… మంత్రుల ఉంటారో ఉండరో నిత్యం అనుమానమే… సీఎం సీటు కోసం నిత్యం ఇంట్ల గోడవ… ఇవన్నీ దారి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామాలని సంజయ్ విమర్శించారు.