గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 130 మందికి పైగా మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో ఈ వంతెనపై 500 మంది వరకూ ఉన్నారని వెల్లడైంది.
వెంటనే ఈ ప్రాంతంలోకి అనేక సహాయక బృందాలను తరలించారు. అంబులెన్స్‌లలో పలువురిని చికిత్సకు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ బ్రిడ్జి కూలిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ వెంటనే స్పందించి తక్షణం అక్కడికి అధికారులు చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి హోం మంత్రి హర్ష సంఘావి, ఆరోగ్య మంత్రి రిషికేశ్ పటేల్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలంకు చేరుకొని రాత్రి అంతా సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. నదిలో పడ్డ పలువురు ఈదుకుంటూ గట్టుకు చేరుకుంటున్నప్పటి ఫోటోలు, ఈ ప్రాంతంలో అరుపులు కేకలుతో పరిస్థితి భయానకంగా మారింది.
బ్రిడ్జి నదిలో ఓ వైపు పూర్తిగా నీటిలో పడిపోయింది. మరోవైపున కొద్దిగా వేలాడుతూ ఉన్న బ్రిడ్జిని, కేబుల్స్ ను పట్టుకుని చాలా మంది బాధితులు పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటం, కొందరు నీళ్లలో ఈదుతుండటం వీడియోల్లో కనిపించింది. బ్రిడ్జి ఉన్నట్టుండి ఒక్కసారిగా మధ్యలో విరిగిపోయిందని, క్షణాల్లోనే కుప్పకూలిపోయిందని తెలుస్తోంది.
రవాణా విమానం ప్రాజెక్టు ఇతర పనుల శంకుస్థాపనకు ఆదివారం గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం తెలియగానే సిఎంతో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మోర్బీకేబుల్ బ్రిడ్జి 140 ఏళ్ల క్రితం బ్రిటిషర్ల కాలంలో మణిమందిర్ వద్ద నిర్మించిన చారిత్రక కట్టడం. ఆరు నెలల క్రితం మరమ్మతుల కోసం బ్రిడ్జిని మూసివేసి పనుల తర్వాత నాలుగైదు రోజుల క్రితమే ఈ నెల 26న గుజరాతీల సంవత్సరాది పండుగ నేపథ్యంలో తిరిగి రాకపోకలకు అనుమతించారు. ఇప్పుడు ఈ దారి ప్రజలకు ముప్పు తెచ్చిపెట్టింది.
దాదాపు రెండు కోట్ల రూపాయల వరకూ వెచ్చించి మరమ్మతు పనులు చేపట్టారు. దర్బార్ గఢ్ నాజర్ బాగ్‌ను కలుపుతూ నిర్మించిన ఈ తీగల వంతెనను 1879 ఫిబ్రవరి 20న అప్పటి బొంబాయి గవర్నర్ బ్రిటిషరు రిచర్డ్ టెంపుల్ ఆరంభించారు.
ఆదివారం ఒకేసారి వందల మంది రావడం, పరిస్థితిని గమనించకుండా అధికారులు వీరిని అనుమతించడంతో బ్రిడ్జి కుప్పకూలిందని వెల్లడైంది. ఇప్పుడు మోర్బీ బ్రిడ్జి కుప్పకూలి పలువురు మృతి చెందిన ఘటనకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి వ్యవహారాల మంత్రి బ్రిజెష్ మిర్జా తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ఇస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మృతుల ఫ్యామిలీలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.