దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తిరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో వాయు నాణ్యత సూచి (ఎక్యూఐ) 408కి చేరుకోగా.. ‘తీవ్రత’ విభాగానికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
కోరలు చాచిన వాయు కాలుష్యంతో ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే మానవ తప్పిదాలు ఈ వాయుకాలుష్యం స్థాయులను మరింత పెంచి పీల్చేగాలిని విషతుల్యం చేస్తున్నాయి
పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగుల బెట్టడంతో పాటు వాహనాల నుండి వచ్చే పొగతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు. మంగళవారం 424గా ఉన్న ఎక్యూఐ బుధవారం నాటికి 376కి మెరుగైంది. గతేడాది డిసెంబర్ 26న ఎక్యూఐ 459కి చేరుకుందని, ఇది అతిచెత్తరికార్డుగా పేర్కొన్నారు.
విషపూరిత గాలిని పీల్చడంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పిఎం 2.5 మైక్రాను లేదా అంతకంటే తక్కువగా ఉండే సూక్ష్మ ధూళికణాలు శ్వాసనాళాల గుండా ఊపిరితిత్తుల్లోకి అక్కడి నుండి రక్తప్రవాహంలోకి చేరతాయని తెలిపారు. దీంతో శ్వాస, ఊపిరితిత్తుల సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే సమయం కావడంతో చిన్నారులు తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. వాయు నాణ్యతా ప్రమాణాలు మెరుగయ్యేంతవరకు పాఠశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించాలని చిన్నారుల హక్కుల సంఘం బుధవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి విజ్ఞప్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దీంతో కొన్ని ప్రేవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రేపటి నుండి ఆన్లైన్ తరగతులు నడపనున్నట్లు సమాచారం. అయితే పాఠశాలలు మూసివేత ఈ సమస్యకు పరిష్కారం కాదని.. కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు దీర్ఘకాల చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గాలి నాణ్యత 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేరడంతో కమర్షియల్ డీజిల్ ట్రక్స్ రాకపోకలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. పెద్దవాహనాలు, బిఎస్-4 డీజిల్ ఇంజిన్ వాహనాల్ని కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్జీతో నడిచే వాహనాల్ని, ఎలక్ట్రిక్ బండ్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించనున్నారు.
గాలి నాణ్యత మెరుగు పడేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం. అందులో భాగంగా జీవ ఇంధనం, లిక్విడ్ పెట్రోల్, నేచురల్ గ్యాస్‌తో నడిచే పరిశ్రమలకు మాత్రమే అనమతిస్తారు. అంతేకాదు రోడ్లు వేయడం, వంతెనలు నిర్మించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్సిమిషన్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయనున్నారు. అలాగే, పోయిన ఏడాది అవలంబించినట్టే సరి, భేసి విధానంలో వాహనాల్ని అనుమతించాలి అనుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం.
ఈనేపథ్యంలో నోయిడాలోని అన్ని స్కూళ్లను ఈ నెల 8 వరకు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఆన్‌క్లాసులు నిర్వహించాలని విద్యా సంస్థలకు స్పష్టం చేశారు. అలాగే 9 నుంచి 12వ తరగతి వరకు కూడా ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు.