టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా వెరవకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మునుగోడు ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ తొత్తులుగా మారి లాఠీఛార్జ్, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా, లాఠీఛార్జ్ చేసినా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. గులాబీలకు గులాంగిరీ చేసే అధికారుల, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలను చేధించుకుని ఓటు హక్కును వినియోగించుకున్న మునుగోడు ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర శాఖ తరపున హ్రుదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఓటింగ్ సరళి, శాతాన్ని చూశాక ప్రతి ఒక్కరికి స్పూర్తి నింపిందని చెబుతూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలనే సంకేతాలను పంపారని భరోసా వ్యక్తం చేశారు.
మునుగోడు ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుండే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల ద్వారా మందు, మనీ పారిస్తూ ప్రలోభాలకు గురిచేశారని సంజయ్ ఆరోపించారు. అనేక అరాచకాలు చేశారని, ఇష్టానుసారంగా మద్యాన్ని పంచారని, ఎక్కడ చూసినా మందు బాటిళ్లే అంటూ ధ్వజమెత్తారు.
వేలాది మంది టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో తిష్టవేసి ప్రలోభాలకు గురిచేస్తుంటే, బీజేపీ నాయకులు దొరకపట్టుకుని అప్పగిస్తే బిజెపి వాళ్లపైనే లాఠీ చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 42 మంది మాత్రమే దొరికారని ప్రకటనలు ఇవ్వడం సిగ్గు చేటని మండిపడ్డారు.
అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శివన్నగూడెం వెళితే తప్పతాగి టీఆర్ఎస్ గూండాలు దాడికి యత్నించారని తెలిపారు. సిద్దిపేట నుండి 200 మంది టీఆర్ఎస్ గూండాలు అరాచకం చేశారని, చండూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పోలింగ్ బూత్ వద్ద క్యూలో ఉంటే ఎస్పీ వచ్చి అడ్డగోలుగా వ్యవహరించారని విమర్శించారు.
ఓటుకు రూ.30 వేలు ఇచ్చినా, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నరని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నరనే విషయం తెలిసే టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఎస్ఐ నుండి ఎస్పీ వరకు అనుకూలమైన అధికారుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలను, కార్యకర్తలను కొట్టించారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.