అవినీతి రుజువై జైలుకు వెళ్లివారిని సైతం కీర్తిస్తున్నారని, వారికి బహుమతులు ఇవ్వాలని సిఫారసులు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన ఎవరి పేరూ పేర్కొనకపోయినా, కేసులు ఎదుర్కొంటున్న కొందరు సామాజిక కార్యకర్తల పేర్లు నోబెల్ బహుమతి కోసం ఇటీవల వెళ్లడాన్ని ఆయన ప్రస్తావించినట్టు భావిస్తున్నారు.
విజిలెన్స్ జాగరూకత వారోత్సవాలలో భాగంగా ఢిల్లీలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ అవినీతిని సహించరాదని, అవినీతిపరులకు రాజకీయ, సామాజిక మద్దతు లభించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
‘వెనక్కి తగ్గొద్దు. మీ వెంట నేనుంటా’నంటూ సీవీసీ సహా అవినీతి నిరోధక సంస్థలను ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి అవినీతిపరుడూ మూల్యం చెల్లించుకునే పరిస్థితి సమాజంలో రావాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అవినీతిపరులుగా తేలినవారికి భజనలు చేయడం చూస్తున్నామని, వారితో ఫొటోలు దిగడానికి కూడా సిగ్గుపడటం లేదని ప్రధాని మండిపడ్డారు.
‘‘చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, నేరం రుజువై జైలుకెళ్లి వచ్చిన వారు సమాజంలో ప్రశంసలు పొందుతున్నారు. కొందరు నిజాయితీపరులు ఇలాంటి వారితో ఫొటోలు దిగేందుకూ సిగ్గుపడటం లేదు. ఇలాంటి అవినీతిపరులు, ఇలాంటి వాతావరణం మన సమాజానికి మంచిదికాదు”అని మోదీ తెలిపారు.
అవినీతిపరులకు రాజకీయ, సామాజిక భద్రత కల్పించొద్దని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని సూచించారు. అవినీతికి పాల్పడిన వారు ఏ హోదాలో ఉన్నా.. ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, వారిపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని హితవు చెప్పారు.
అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని మోడీ మెచ్చుకున్నారు. సమాజ సంక్షేమానికి పనిచేస్తున్నప్పుడు గిల్టీగా బతకాల్సిన అవసరం లేదని దర్యాప్తు ఏజెన్సీ అధికారులను ఉద్దేశించి అన్నారు. ఆడిట్, ఇన్స్పెక్షన్స్ను మరింత ఆధునీకరించేందుకు విజిలెన్స్ సంస్థలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చర్యలపై ప్రభుత్వ శాఖలకు ర్యాంకింగ్స్ ఇచ్చేలా చూడాలని చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతికి చోటు లేకుండా చేయాలని, అవినీతిని ప్రోత్సహించని వ్యవస్థను మనం రూపొందించుకోవాలని కోరారు.
అవినీతి, అవినీతిపరులకు వ్యతిరేకంగా పనిచేసే సి.వి.సి. వంటి సంస్థలు ఏవిధంగానూ, ఆత్మరక్షణ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా, వారు ఏ రాజకీయ అజెండాతో పని చేయాల్సిన అవసరం లేదనీ, సాధారణ ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
“స్వార్థ ప్రయోజనాలను కలిగి ఉన్నవారు విచారణలను అడ్డుకోవడానికి, ఈ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల పరువు తీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ జనతా జనార్దన్ భగవంతుని రూపం, వారు సత్యాన్ని తెలుసుకుంటారు, పరీక్షిస్తారు, సమయం వచ్చినప్పుడు, వారు సత్యానికి మద్దతు ఇచ్చే వారితో నిలబడతారు.”, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ విధులను అంకితభావంతో నెరవేర్చేందుకు సత్య మార్గంలో నడవాలని చెబుతూ “మీరు దృఢ నిశ్చయంతో చర్య తీసుకున్నప్పుడు, దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది” అని ఆయన అభయమిచ్చారు.
“అమృత్ కాల్ సమయంలో పారదర్శకమైన, పోటీతత్వ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను”, అని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సవాలును పరిష్కరించే పద్దతిలో స్థిరమైన చైతన్యం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. వ్యాసరచన పోటీ విజేతలతో సంభాషించడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో వక్తృత్వ పోటీని ప్రవేశపెట్టాలని సూచించారు.
“మురికిని తొలగించినప్పుడే పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. “చట్టం పరిధికి వెలుపల పని చేసేవారిని గుర్తించే విషయంలో సాంకేతికత ఖచ్చితంగా పేపర్ ట్రయిల్ ను వదిలివేస్తుంది”, అని గమనించిన ప్రధానమంత్రి, అవినీతికి వ్యతిరేకంగా ఈ పోరాటంలో సాంకేతికతను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, డా. పి.కె. మిశ్రా; సిబ్బంది, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్; కేబినెట్ కార్యదర్శి, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్. పటేల్; విజిలెన్స్ కమిషనర్లు పి.కె. శ్రీవాస్తవ, అరవింద కుమార్ తదితరులు పాల్గొన్నారు.