టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవి శ్రీ ప్రసాద్ ‘ఓ పరి’ ప్రైవేట్ వీడియో సాంగ్‌లో హరే రామ-హరే కృష్ణ అని పాడుతూ అభ్యంతరకంగా డ్యాన్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో దేవీ శ్రీ ప్రసాద్‌పై సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంలో న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఐటెం సాంగ్లా ఉందని, అందులో హరే రామ హరే కృష్ణ మంత్రం ఎలా వాడతారని పలువురు మండిపడుతున్నారు.
సాంగ్ వీడియోలో అమ్మాయిలతో డీఎస్పీ డ్యాన్స్ చేస్తుండగా.. హరే రామ హరే కృష్ణ లిరిక్స్ కనిపిస్తున్నాయి. సాంగ్ లో హరే రామ లిరిక్స్ తొలగించాలని ఇప్పటికే డిమాండ్స్ తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంపై రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతాడనేది తెలియాల్సి ఉంది.
రాక్ స్టార్ గా పేరొందిన దేవీ శ్రీ ఇటీవలే నాన్ ఫిల్మ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మ్యూజిక్ వీడియోను బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ లాంఛ్ చేశారు. ‘ఓ పరి’ టైటిల్ తో సాంగ్ సాగనుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వయంగా కంపోజ్ చేయడమే కాకుండా ఆయనే పాడారు. అయితే పాట మధ్యలో హరే రామ..హరే కృష్ణ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.