కెసీఆర్ విడుదల చేసిన ముగ్గురు స్వాములు – నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వీడియోపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా కేసును సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పజెబితే తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. న్యాయమూర్తులకు వీడియోలు పంపే బదులు న్యాయవిచారణకు సిద్ధంకావాలని సూచించారు.
వివాదం మొదలైన మరుక్షణమే నిజానిజాలు తేలేందుకు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వాలను కూలదోసే ఆలోచన తమది కాదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసి ప్రజల ఓట్లడిగి విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నలుగురు ఆర్టిస్టులను కూర్చోబెట్టి వీడియో రికార్డింగ్ చేసి ఇది అన్యాయం, అక్రమం అని గోలచేస్తే.. నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని హితవు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని చీల్చి కేటీఆరే వస్తానన్నా తాము చేర్చుకోబోమని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ‘ఫాంహౌజ్ వీడియో’ పేరుతో అందమైన కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఇదివరకు చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతూ.. సాగదీసి చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా, ముఖ్యమంత్రి పీఠం స్థాయి దిగజార్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల, అమరుల ఆకాంక్షాలను పూర్తిచేయాలన్న సత్సంకల్పం ఉన్న ఎవరినైనా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమన్న కిషన్ రెడ్డి.. ఇందుకోసం తమ పార్టీ కొన్ని విధానాలతో ముందుకెళ్తోందని చెప్పారు.
బీజేపీలో చేరేవారు ఎవరైనా సరే పార్టీ ద్వారా వచ్చిన పదవులను వదులుకోవాల్సిందేనని, రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటున్నామని తెలిపారు. పార్టీలో చేర్చుకోడానికి తాము ప్రత్యేకంగా ఈటల రాజేందర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ క్రమంలో తమకు స్వామీజీలు, పార్టీతో సంబంధం లేని వ్యక్తుల మధ్యవర్తిత్వం అవసరం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆ వీడియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు పార్టీతో సంబంధమే లేదని.. అలాంటప్పుడు ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఎలా అంటారని ఎదురు ప్రశ్నించారు. పైగా ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు బీజేపీ ఇవ్వజూపినట్టుగా చిత్రీకరిస్తున్నారని, వారిలో ఏ ఒక్కరూ 100 పైసలకు కూడా పనికిరారని వ్యాఖ్యానించారు.
బీజేపీలో ఇప్పటివరకు ఎంతో మంది చేరారని, వారిలో ఎవరైనా డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకున్నామా చెప్పాలని ప్రశ్నించారు. ఎవరో ఒకరు అమిత్ షా గారితో ఫొటో దిగాడని.. ఆయనకు కేంద్రానికి సంబంధం ఉందని అర్థరహితమైన విమర్శలు ముఖ్యమంత్రి పీఠానికి శోభనివ్వవని ఆయన ధ్వజమెత్తారు.