తెలంగాణాలో జరిగిన ప్రతిష్టాత్మక మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయింది.మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా, మొదట్లో రెండు రౌండ్లలో తప్ప అన్ని రౌండ్లలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతలో ఉంటూ వచ్చారు.
వరుసగా దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో తమ పార్టీ సీట్లను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం మంత్రులు, 100 మంది పార్టీ ఎమ్యెల్యేలను మోహరింపచేసి ప్రచారం నిర్వహించారు. దేశంలోనే అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన ఎన్నికలలో ఒకటిగా మిగిలింది. టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు పోటీపోటీగా ధనం వెదజల్లారు.
అయితే, పోలింగ్ ముందు రోజులలో బిజెపి ప్రచారాన్ని కట్టడి చేయడంలో, ప్రజల దృష్టిని ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంవైపు మళ్లించడంలో విజయం సాధించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో గెలుపుపై ధీమాతో ఉన్న బిజెపికి కొద్దిపాటిలో పరాజయం తప్పలేదు.
ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు బిజెపి అభ్యర్థి రాజగోపాలరెడ్డి ప్రకటిస్తూ మునుగోడులో అధర్మం గెలిచిందని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అదికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆ పార్టీ నేతలు ప్రజల్ని బెదిరించారని తెలిపారు. అంతేకాదు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించారు. నైతిక విజయం తనదేనని అన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడు పోయారని రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.
దేశంలో మొత్తం ఆరు రాస్త్రాలలో జరిగిన ఏడు ఉపఎన్నికలలో ఆరు చోట్ల పోటీ చేసిన బిజెపి మూడు చోట్ల గెలుపొందింది. మరో ఫలితం ఒడిశా నుంచి తెలియవలసి ఉంది. అక్కడ కూడా బిజెపి ముందంజలో ఉంది.
హర్యానా, ఉత్తర ప్రదేశ్ లలో జరిగిన రెండు ఉపఎన్నికలలో మంచి ఆధిక్యతతో గెలుపొందగా,బీహార్ లో రెండు సీట్లకు ఎన్నిక జరిగిన ఒక సీట్ గెలుపొందింది.. మరో సీట్ లో ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు. ఇక ముంబైలో జరిగిన ఒక ఉపఎన్నికలో బిజెపి పోటీ చేయకపోవడంతో ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన అభ్యర్థి సునాయనంగా గెలుపొందారు. ఆమెకు నోటా నుండి ప్రధాన పోటీ ఎదురైనది.
ఉత్తర ప్రదేశ్‌లోని గోలా గోకరణ్నాథ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై దాదాపు 34,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన తండ్రి అరవింద్ గిరి మరణంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. దీంతో బీజేపీ తన స్థానాన్ని తాను నిలుపుకోగలిగింది.
హర్యానాలోని అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్‌పై ఘన విజయం సాధించారు. భజన్ లాల్ కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కుల్దీప్ కుమారుడే భవ్య బిష్ణోయ్.
బిహార్‌లోని గోపాల్ గంజ్ శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ సింగ్ మరణించడంతో గోపాల్‌గంజ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి కుసుమ్ దేవి పోటీ చేశారు. దీంతో బీజేపీ తన స్థానాన్ని తాను నిలబెట్టుకున్నట్లయింది.
బిహర్‌లోని మొకామా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి విజయం సాధించారు. అనంత్ కుమార్ సింగ్‌పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. నీలం దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవిపై దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
మహారాష్ట్రలోని తూర్పు అంధేరీ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రుతుజ లట్కే విజయం సాధించారు. ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేయలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్ఎస్ కూడా రుతుజకు రుతుజకు మద్దతు పలికాయి.
ఒడిశాలోని ధామ్ నగర్ శాసన సభ స్థానంలో బీజేడీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. అయితే బీజేపీ కాస్త ముందంజలో కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి సూర్యబంషి సూరజ్ తన సమీప ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ కన్నా ముందంజలో ఉన్నారు. 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 6,755 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి సూర్యబంషి కనిపించారు.