కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులో బెంగళూరు కోర్టులో చుక్కెదురైనది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్, భారత్ జోడో యాత్రకు ప్రచారానికి వాడుతున్న ట్విట్టర్ హ్యాండిళ్లను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యాజమాన్యానికి కోర్టు ఆదేశించింది.
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఒక వీడియోలో కేజీఎఫ్-2 సినిమా పాటను కాంగ్రెస్ వాడుకున్నదని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ చేసిన ఫిర్యాదు చేసింది.
హిందీలో కేజీఎఫ్-2 పాటల హక్కులను పొందేందుకు తాము పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఈ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ ఫిర్యాదును విచారించిన బెంగళూరు కోర్టు ఇది ముమ్మాటికీ కాపీరైట్ నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించింది. అయితే, తీవ్రమైన చర్యలు కాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ట్విట్టర్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.