పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసగించి బ్రిటన్ పారిపోయిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడంలో ముందడుగు పడింది. తనను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, మానసిక ఆరోగ్య కారణాలను పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.
నీరవ్ అప్పీల్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేతో కూడిన ధర్మాసనం, పరారీలో ఉన్న ఆయనను భారత్‌కు అప్పగించేందుకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది.
‘నీరవ్ మోడీ మానసిక పరిస్థితి, ఆయన ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం, ఆయనను అప్పగించడం అన్యాయమని లేదా అణచివేతకు గురిచేస్తుందని మేం భావించడం లేదు. నీరవ్ చేసిన వాదనలపై మేం సంతృప్తి చెందలేదు’ అని కోర్టు పేర్కొంది. అక్టోబర్ 12న రిజర్వ్ చేసిన తీర్పును బుధవారం వెల్లడించింది.
మరోవైపు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న 51 ఏళ్ల నీరవ్ మోదీ, లండన్ హైకోర్టు తీర్పుపై 14 రోజుల్లోగా బ్రిటన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే సాధారణంగా ప్రజా ప్రాముఖ్యత ఉంటేనే సుప్రీంకోర్టులో అప్పీల్‌కు హైకోర్టు అంగీకరిస్తుంది.