తన ఫోన్ ట్యాప్ అవుతుందని తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తద్వారా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని చెప్పారు.
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో కూడా రాజ్ భవన్ ను లాగాలని చూశారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారని పేర్కొంటూ ఫాంహౌస్ ఆడియో టేస్ విషయంలోనూ రాజ్ భవన్ ప్రస్తావన వచ్చిందని గుర్తు చేశారు. తన మాజీ ఏడీసీ తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని చెబుతూ తుషార్ గతంలో తనకు ఏడీసీగా పని చేశారని ఆమె తెలిపారు.
తాను ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవంక, బిల్లులను తాను కూలంకుశంగా పరిశీలిస్తుంటే.. తాను బిల్లులను తొక్కి పెట్టానని బయట తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె విచారం వ్యక్తం చేశారు.
బిల్లును తొక్కి పెట్టాలనుకుంటే వివరణ ఎందుకు కోరతానని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి దుష్ప్రచారం కారణంగా బిల్లులను తానే ఆపానని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక్కొక్క బిల్లును కూలంకుశంగా పరిశీలిస్తున్నానని చెబుతూ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు.
నియామకాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందే తానే అని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో ఓ విధానం అమల్లో ఉన్నప్పుడు కొత్త తరహా విధానాన్ని ప్రభుత్వం తేవాలనుకుంటోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంగానే తనకున్న అనుమానాలపై వివరణ కోరినట్లు వెల్లడించారు .బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యేక రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుపై మరిన్ని వివరాలు కావాలని అడిగానని తెలిపారు. యూనివర్సిటీలే కేంద్రంగా రిక్రూట్ బోర్డు ఉంటుందా? అని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రజల కోసం రాజ్ భవన్ పారదర్శకంగా పనిచేస్తుందని ఆమె చెప్పారు.
తాను జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడదని గవర్నర్ ప్రశ్నించారు. తన పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తామని ఆమె చెప్పారు. ప్రొటోకాల్ పాటించేవారైతే తనకు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆమె నిలదీశారు.