ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు కు బెంగళూరు లోని కెఎస్ఆర్ రైల్ వే స్టేశన్ లో పచ్చజెండా ను చూపించి, ఆ రైళ్ళ ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ (కెఎస్ఆర్) రైల్ వే స్టేశన్ లో 7వ నంబరు ప్లాట్ ఫార్మ్ కు చేరుకొని, చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి సిగ్నల్ ను చూపెట్టారు.
ఇది దేశం లో అయిదో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కానుంది. అంతేకాకుండా, ఇది దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా కానుంది. ఇది పారిశ్రామిక కేంద్రం అయినటువంటి చెన్నైకి, టెక్- స్టార్ట్-అప్ కేంద్రం అయినటువంటి బెంగళూరుకు, ఇంకా ప్రముఖ పర్యటక నగరం అయినటువంటి మైసూరుకు మధ్య సంధానాన్ని పెంపొందింప చేయనుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ సంధానించడం తో పాటు వాణిజ్యపరమైన కార్యకలాపాలకు ఊతంగా కూడా నిలవనుంది. ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ సైతం ఇది వృద్ధి చెందింపచేయనుంది. బెంగళూరులో ఈ రైలు కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
తర్వాత ప్రధాన మంత్రి 8వ నంబరు ప్లాట్ ఫార్మ్ కు చేరుకొని భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు కు ప్రారంభ సూచకంగా ఆకుపచ్చని సిగ్నల్ ను ఇచ్చారు. కర్నాటక నుండి యాత్రికులను కాశీ కి పంపించడం కోసం కర్నాటక ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ కలసి భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ఈ రైలును తీసుకు వచ్చాయి.
ఈ తరహా రైలును తీసుకు వచ్చినటువంటి మొదటి రాష్ట్రం కర్నాటకయే. యాత్రికులు కాశీని, అయోధ్యను, ప్రయాగ్ రాజ్ ను సందర్శించడం కోసం సౌకర్యవంతమైన బసను, ఇంకా మార్గదర్శనాన్ని వారికి అందించడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు ను అందిస్తున్న మొదటి రాష్ట్రంగా కర్నాటక ముందుకు వచ్చినందుకు కర్ణాటకను నేను అభినందించ దలచుకొన్నాను. ఈ రైలు కాశీని, కర్నాటకను సన్నిహితం చేయడంతో పాటుగా యాత్రికులు, పర్యటకులు కాశీని, అయోధ్యను, ఇంకా ప్రయాగ్ రాజ్ ను సౌలభ్యవంతంగా సందర్శించ గలుగుతారు.’’ అని పేర్కొన్నారు.
అంతకు ముందు నాడప్రభు శ్రీ కెంపెగౌడ యొక్క 108 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ బెంగళూరులో ఆవిష్కరించారు. ఈ నగరం అభివృద్ధికి బెంగళూరు నగరం సంస్థాపకుడు అయిన నాడప్రభు కెంపెగౌడ అందించిన తోడ్పాటును స్మరించుకోవడం కోసం ఈ విగ్రహాన్ని నిర్మించారు. జ ‘‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’’ తో పేరు తెచ్చుకొన్న రామ్ వి. సుతార్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకొన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 98 టన్నుల కంచును, 120 టన్నుల ఉక్కును ఉపయోగించారు.
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ టర్మినల్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. ప్రధాన మంత్రి వెంట కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కర్నాటక గవర్నరు థావర్ చంద్ గహ్ లతో పాటు కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోశి లు ఉన్నారు.