రెండు రోజుల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం గురించి కోర్ కమిటీ సభ్యులకు ప్రధాని కీలకమైన సూచనలు చేశారు.
పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ప్రధానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పవన్ ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్ని తనకు తెలుసని ప్రధాని ఈ చెప్పారు.
‘రెండు రోజుల కిందట నాకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది. అనేక సార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన్ని కలిశాను. ఆ తర్వాత ప్రధానిని ఎప్పుడూ కలవలేదు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే కలవడం’ అని జనసేన అధినేత తెలిపారు.
` ప్రత్యేక పరిస్థితుల్లో కలిసిన మీటింగ్ ఇది. మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. ప్రధాని ఆకాంక్ష కూడా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు తెలియజేశానని చెప్పారు. ‘భవిష్యత్తులో ఇది ఏపీకి మంచి రోజులు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో తాజా పరిణామాలను వివరించటంతో పాటుగా..ఆర్దిక క్రమశిక్షణ గాడి తప్పిందంటూ ప్రధానికి పవన్ వివరిస్తుండగా.. ఏపీలోని విషయాలన్నీ తనకు తెలుసని ప్రధాని స్పష్టం చేసారు. అదే సమయంలో రాజకీయంగా పవన్ నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ప్రధాని ప్రయత్నించారని తెలుస్తోంది.
ఆ తర్వాత బిజెపి కోర్ కమిటీ సభ్యులతో గంటన్నరకు పైగా సమావేశమైన ప్రధాని కొంతకాలం క్రితం గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో బిజెపి పరిస్థితి ఒకేవిధంగా ఉండేదని, ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నదని, కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రాష్ట్రంలో వచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని చెబుతూ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి గురించి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జ్ షీట్ లను ప్రచురిస్తూ, వాటిని ప్రజలలో ప్రచారం చేయాలని ప్రధాని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. అప్పుడే ప్రజలకు దగ్గర కాగలమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కృషి చేయాలని చెబుతూ ఈ విషయమై కేంద్ర పార్టీ కూడా దృష్టి సారిస్తోందని చెప్పారు.
అంతకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ , గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ స్వాగతం పలికారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగా ల్యాండయిన మోదీ, అక్కడినుంచి మారుతి జంక్షన్ వరకు రోడ్ మార్గంలో వెళ్లారు. విశాఖ వాసులకు కారునుంచి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. అనంతరం ఐఎన్ఎస్ చోళాకు చేరుకున్న మోదీ.. జనసేన అధినేత పవన్‌తో భేటీ అయ్యారు.
అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి తమ మద్దతుకు సంబంధించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ స్పూర్తితో కేంద్రం – రాష్ట్ర సంబంధాలు వేరు, అదే సమయంలో రాజకీయం వేరని ప్రధాని తేల్చి చెప్పారు. రాజకీయంగా బలోపేతం కావటం పైన ఏపీ బీజేపీ నేతలు ఫోకస్ చేయాలని ప్రధాని ఆదేశించారు. అందుకోసం స్థానికంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లో నిలదీయాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు అలా చేయద్దని ఎవరైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు.