జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విశాఖపట్నంలో జరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాల నుండి ఫిర్యాదు చేసిన సమయంలోనే రాష్ట్రంలో పోలీసులు పలుచోట్ల జనసేన శ్రేణులను వేధించడం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి.
స్వయంగా పవన్ కళ్యాణ్ పైననే తాడేపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జనసేన సభ కు ఇప్పటం గ్రామస్థులు స్థలాలు ఇచ్చారనే కోపంతో వారి ఇళ్లను రోడ్ విస్తరణ పేరుతో కూల్చారని జనసేన ఆరోపించింది. ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటంకు వెళ్లిన సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకొంది.
తనను పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన ఇప్పటం వెళ్లే ప్రయత్నం చేశారు. ఆపై కారుపైకి ఎక్కి ప్రయాణించారు. కారు వేగంగా దూసుకుపోతున్నా కూడా ఆయన కాళ్లు బారజాపుకుని అలానే కూర్చిండి పోయారు. ఇలా టాప్ పైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హైవేపై పలు వాహనాలు పవన్ కాన్వాయ్‌ను అనుసరించడం వంటి కారణాలు చూపిస్తూ శివకుమార్ అనే వ్యక్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఐపీసీ 336, రెడ్ విత్ 177ఎంవి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవంక తిరుపతిలో జనసేన నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ను బలవంతంగా రాత్రిపూట పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ 5 పేజీల లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి పవన్ రూట్ మ్యాప్ కోరారు. ప్రతిపక్షాలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. విశాఖ భూకుంభకోణాలు, రుషికొండ అంశాలను పవన్ ప్రస్తావించారు.
అలాగే మూడు రాజధానుల వివాదం, అమరావతి రైతుల ఇబ్బందులను పవన్ పేర్కొన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి, జగనన్న ఇళ్ల పరిస్థితిపై పవన్ కల్యాణ్ ప్రధానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కలిసి రావడం లేదని పవన్ లేఖలో పేర్కొన్నారు.
రుషికొండ భూముల పరిశీలన
విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు యథచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రిషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటపెట్టుకుని రిషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్…కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా, వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఒ మట్టి గుట్టను ఎక్కి…బారీకేడ్ల ఆవతలి వైపు ఏం జరుగుతుందన్న దానిని పరిశీలించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పరిశీలిస్తున్న వీడియోని రిలీజ్ చేశారు.