సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.. మెజార్టీ వాటా రాష్ట్రానిది.. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలా విక్రయిస్తుంది? అని ప్రశ్నించారు.
ఇదంతా తప్పుడు ప్రచారం.. నిజం కాదు.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు అని ప్రధాని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ మహాత్మా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా మోదీ రూ. 6338 కోట్ల వ్యయంతో నిర్మించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సిఎల్)ను వేదిక నుంచి జాతికి అంకితం చేశారు.
ఇదే వేదిక నుంచి ప్రధాని రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ పను లు, బోధన్-బాసర-భైంసా హైవే పనులకు, సిరొంచామహాదేవ్‌పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
అనంతరం మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణలోని 70 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా రైతులు తిలకిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల వ్యవసాయం, వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి సాధించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక పరిపుష్టి సాధిస్తామని ప్రధాని తెలిపారు. గత 8 సంవత్సరాల కాలంలో దేశంలో అన్ని రంగాలలో అద్భుతమైన పురోగతి సాధించిందని, వాటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సాధించామని గుర్తు చేశారు.
ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత దేశం త్వరలో ఎదుగుతుందని ప్రపంచ మేధావులు అంఛనా వేశారని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తూ నూతన కార్యక్రమాల పనులు సమాంతరంగా చేపడుతున్నామని చెబుతూ 2030 నాటికి అనేక రంగాలలో ఏర్పరుచుకున్న లక్షాలను పూర్తి చేసే దిశగా కొనసాగుతున్నామని వివరించారు.
ఎరువుల కర్మాగారం, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని మోదీ అభిలాషించారు. “అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కూడా లభించాయన్నారు. కొత్త ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచాం. మేం శంకుస్థాపనలకే పరిమితం కాలేదు, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించాం” అని చెప్పారు.
“రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశాం. కర్మాగారాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయినా.. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టాం. 5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోంది” అని ప్రధాని గుర్తు చేశారు.
తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నామని చెబుతూ నానో యూరియా టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 2014కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లని ర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చూశామని అంటూ, భవిష్యత్‌లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని ప్రధాని వెల్లడించారు.
తాము తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజారు మార్కెట్ బంద్ అయ్యిందని ప్రధాని చెప్పారు. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ భారత దేశంలో పెంచలేదని, ప్రతి యూరియాపై రూ.1472, డిపిఎ బ్యాగ్‌పై రూ.2500 రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని పేర్కొన్నారు.
నూతనంగా శంకుస్థాపన చేసిన జాతీయ రహాదారుల విస్తరణ పనుల ద్వారా హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు, పసుపు మిర్చి రైతులకు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ అభివృద్ధిపై అందరం దృష్టి సారించి ముందుకు సాగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.